తమిళనాడు ప్రీమియర్ లీగ్ వేలంలో సాయి సుదర్శన్‌కి రూ.21.6 లక్షల ధర... ఐపీఎల్‌లో రూ.20 లక్షలు అందుకుంటున్న తమిళనాడు క్రికెటర్.. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలానికి ఉండే క్రేజ్ అందరికీ తెలుసు. ఐపీఎల్ ఫ్యాన్స్ ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారంటే దానికి అందరూ చెప్పే సమాధానం ఒక్కటే తమిళనాడు. తమిళ్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్‌కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అక్కడ క్రికెట్‌కి ఉండే క్రేజ్‌కి పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలుస్తోంది తమిళనాడు ప్రీమియర్ లీగ్...

8 టీమ్‌లతో సాగే తమిళనాడు ప్రీమియర్ లీగ్, 2016లో ప్రారంభమైంది. ఇప్పటికే ఆరు సీజన్లు ముగించుకున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్‌, 2023 సీజన్‌ కోసం వేలం నిర్వహించారు. ఇంతవరకూ ఈ లీగ్‌లో డ్రాఫ్ట్ రూపంలో ప్లేయర్లను కొనుగోలు చేసేవారు. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న ప్లేయర్లకు రూ.6 లక్షలు, ఫస్ట్ క్లాస్‌ క్రికెట్ ఆడిన ప్లేయర్లకు రూ.2 నుంచి రూ.3 లక్షలు ఇచ్చేవాళ్లు. మిగిలిన ప్లేయర్లకు రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకూ ముట్టచెప్పేవారు.

తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ వేలంలో ఒక్కో ఫ్రాంఛైజీ రూ.70 లక్షల పర్సు వాల్యూతో బరిలో దిగగా కొందరు ప్లేయర్లు రికార్డు ధర దక్కించుకున్నారు. ఆల్‌రౌండర్ సాయి సుదర్శన్‌ని రూ.21.6 లక్షలకు కొనుగోలు చేసింది లైకా కోవై కింగ్స్ టీమ్. సాయి సుదర్శన్, ఐపీఎల్ 2023 ద్వారా రూ.20 లక్షలు అందుకోబోతుంటే, తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అంతకంటే ఎక్కువ మొత్తం తీసుకోబోతున్నాడు..

2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత పూర్తిగా తెరమరుగైపోయిన వరుణ్ చక్రవర్తిని రూ.6.75 లక్షలకు కొనుగోలు చేసింది దిండిగుల్ డ్రాగన్స్ టీమ్. అలాగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 సీజన్‌లో టీమిండియాలో స్టార్‌లా దూసుకొచ్చిన యార్కర్ల నట్టూని బల్లీసి ట్రిచీ టీమ్ రూ.6.25 లక్షలకు సొంతం చేసుకుంది.. 

సాయి కిషోర్‌ని తిరుపుడి తమిళన్స్ టీమ్ రూ.13 లక్షలకు కొనుగోలు చేయగా సంజయ్ యాదవ్‌ని చెపాక్ సూపర్ గిల్లీస్ టీమ్ రూ.17.60 లక్షలకు దక్కించుకుంది. సందీప్ వారియర్‌ని నెల్లాయ్ రాయల్ కింగ్స్‌ టీమ్ రూ.8.25 లక్షలకు కొనుగోలు చేసింది.

ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ని తిరుప్పూర్ తమిళన్స్ టీమ్ ఏకంగా రూ.10.25 లక్షలకు దక్కించుకుంది. అరుణ్ కార్తీక్‌ని నెల్లాయ్ రాయల్ కింగ్స్ రూ.12 లక్షలకు కొనుగోలు చేయగా స్వప్నిల్ సింగ్‌ని మధురై పాంథర్స్ రూ.12 లక్షలకు దక్కించుకుంది. భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ని మధురై పాంథర్స్ టీమ్‌ రూ.6.75 లక్షలకు దక్కించుకుంది. 

భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్, తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా మెరిశాడు. దిండిగుల్ డ్రాగన్స్ టీమ్ సభ్యుడిగా ఈ వేలానికి హాజరయ్యాడు అశ్విన్.