ఆసియా కప్ కోసం బీసీసీఐ ప్రకటించిన 17 మంది జట్టులో తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు ఛాన్స్ దక్కింది. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు తిలక్ థ్యాంక్స్ చెప్పాడు. ఒత్తిడి లేకుండా వుండాలని రోహిత్ భయ్యా ప్రోత్సహించేవాడని తిలక్ చెప్పాడు.
క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 ఆగస్ట్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఆసియా ఖండంలోని ఆరు దేశాలు పాల్గొనే ఈ టోర్నీ కోసం బీసీసీఐ 17 మందితో కూడిన జట్టును నిన్న ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నారు. ఈ స్క్వాడ్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా చోటు దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా జట్టులో బెర్త్ కన్ఫర్మ్ కావడంపై తిలక్ వర్మ హర్షం వ్యక్తం చేశాడు.
తనకు మద్ధతుగా నిలిచిన కెప్టెన్ రోహిత్ శర్మకు థ్యాంక్స్ చెప్పాడు. తాను ఐపీఎల్‌లో ఆడే సమయంలోనూ తను నా దగ్గరకు వచ్చి మాట్లాడేవాడని తెలిపాడు. ఆటను ఆస్వాదించాలని.. ఒత్తిడి లేకుండా వుండాలని రోహిత్ భయ్యా ప్రోత్సహించేవాడని తిలక్ చెప్పాడు. ఐపీఎల్‌లో బాగా ఆడానని.. ఆసియా కప్‌లోనూ బాగా రాణించాలనుకుంటున్నానని పేర్కొన్నాడు.
కాగా.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన తిలక్ వర్మకు రోహిత్‌తో మంచి బంధం ఏర్పడింది. క్లిష్ట పరిస్ధితుల్లో జట్టును ఆదుకోవడం ముంబై కెప్టెన్‌ను ఆకట్టుకుంది. ఇక ఇటీవల ముగిసిన ఐదు టీ20ల సిరీస్‌లో తిలక్ వర్మ 173 పరుగులు చేసి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఒకవేళ ఆసియా కప్‌లో గనుక తిలక్ వర్మ ఆదరగొడితే టీమిండియా ప్రపంచకప్ స్క్వాడ్‌లోనూ ప్లేస్ సంపాదించే అవకాశాలు మెరుగ్గా వున్నాయి.
ALso Read: ఆసియా కప్ 2023 టోర్నీకి జట్టుని ప్రకటించిన బీసీసీఐ... మళ్లీ అదే తప్పు! ఆ ఇద్దరూ మిస్...
ఇకపోతే.. రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించే ఆసియా కప్ టోర్నీకి, హార్ధిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. జస్ప్రిత్ బుమ్రాకి వన్డే వైస్ కెప్టెన్సీ దక్కవచ్చని ప్రచారం జరిగినా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు వైట్ బాల్ వైస్ కెప్టెన్సీని మార్చకపోవడమే బెటర్ అని బీసీసీఐ పెద్దలు భావించారు. రోహిత్ శర్మతో కలిసి శుబ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేయబోతుంటే, విరాట్ కోహ్లీ వన్‌డౌన్‌లో ఆడబోతున్నాడు. నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
శ్రేయాస్ అయ్యర్ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని వార్తలు వచ్చినా, ఆసియా కప్ 2023 టోర్నీలో అతను రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నాలుగో స్థానంలో వన్డేల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్న సూర్యకుమార్ యాదవ్‌తో పాటు వెస్టిండీస్ టూర్‌లో ఎంట్రీ ఇచ్చిన తిలక్ వర్మలకు కూడా చోటు దక్కింది. కెఎల్ రాహుల్‌తో పాటు ఇషాన్ కిషన్ వికెట్ కీపర్‌గా జట్టులో చోటు దక్కించుకున్నాడు. రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్లుగా 17 మంది జట్టులో చోటు దక్కించుకున్నారు..
కుల్దీప్ యాదవ్ స్పిన్నర్‌గా ఆసియా కప్ ఆడబోతుంటే, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఫాస్ట్ బౌలర్లుగా ఆసియా కప్ 2023 టోర్నీకి ఎంపికయ్యారు. సంజూ శాంసన్ స్టాండ్ బై ప్లేయర్‌గా శ్రీలంకకి వెళ్లబోతున్నాడు. ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన శిఖర్ ధావన్, ఆసియా కప్ 2023 జట్టులో చోటు దక్కించుకుంటాడని ఫ్యాన్స్ ఆశించారు. అయితే శిఖర్ ధావన్‌ని పూర్తిగా పక్కనబెట్టేసింది టీమిండియా మేనేజ్‌మెంట్. అలాగే స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్‌కి కూడా ఆసియా కప్ 2023 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ఎంపిక కాని యజ్వేంద్ర చాహాల్, 2022 టీ20 వరల్డ్ కప్‌కి ఎంపికైనా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు..
