తిలక్ వర్మ హాఫ్ సెంచరీ... టాపార్డర్‌తో పాటు మిడిల్ ఆర్డర్ అట్టర్ ఫ్లాప్.. 150 దాటించిన లోయర్ ఆర్డర్ బ్యాటర్లు..
మొదటి టీ20 మ్యాచ్‌లో 150 పరుగుల ఈజీ టార్గెట్‌ని ఛేదించలేక చతికిల పడిన భారత బ్యాటర్లు, రెండో టీ20లోనూ పెద్దగా ప్రతాపం చూపించలేకపోయాడు. మొదటి టీ20లో టాప్ స్కోరర్‌గా నిలిచిన తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో రాణించినా మిగిలిన బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించలేదు. దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగుల స్కోరు మాత్రమే చేయగలిగింది.
9 బంతుల్లో ఓ సిక్సర్‌తో 7 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, అల్జెరీ జోసఫ్ బౌలింగ్‌లో సిమ్రాన్ హెట్మయర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. జోసఫ్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన శుబ్‌మన్ గిల్, ఆ తర్వాతి బంతికి కూడా షాట్ ప్రయత్నించి అవుట్ అయ్యాడు. అల్జెరీ జోసఫ్ కెరీర్‌లో ఇది 50వ టీ20 వికెట్.
3 బంతుల్లో 1 పరుగు చేసిన సూర్యకుమార్ యాదవ్, రనౌట్ అయ్యాడు. కైల్ మేయర్స్ కొట్టిన డైరెక్ట్ హిట్ కారణంగా థర్డ్ అంపైర్ నిర్ణయం ప్రకటించకముందే పెవిలియన్ చేరాడు సూర్య.. వెస్టిండీస్ టూర్‌లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో సూర్యకుమార్ యాదవ్ ఒక్కసారి కూడా 40+ స్కోరు చేయలేకపోయాడు. మూడో వన్డేలో చేసిన 35 పరుగులే, వెస్టిండీస్ టూర్‌లో సూర్యకుమార్ చేసిన అత్యధిక స్కోరు.
18 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ కలిసి ఇన్నింగ్స్ నిర్మించేందుకు సమయం తీసుకున్నారు. మూడో వికెట్‌కి 42 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత ఇషాన్ కిషన్ వికెట్ కోల్పోయింది టీమిండియా.. 23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
అకీల్ హుస్సేన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ముందుకు వచ్చిన సంజూ శాంసన్, స్టంపౌట్ అయ్యాడు. 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన సంజూ శాంసన్, మరో అవకాశాన్ని వృథా చేసేశాడు. 76 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది టీమిండియా. రెండో అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న తిలక్ వర్మ, 39 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ అందుకున్నాడు..
రోహిత్ శర్మ తర్వాత అతి పిన్న వయసులో టీమిండియా తరుపున టీ20 హాఫ్ సెంచరీ బాదిన భారత క్రికెటర్‌గా నిలిచాడు తిలక్ వర్మ. 41 బంతుల్లో 51 పరుగులు చేసిన తిలక్ వర్మ, అకీల్ హుస్సేన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. 18 బంతుల్లో 2 సిక్సర్లతో 24 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యాని అల్జెరీ జోసఫ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఓబెడ్ మెకాయ్ వేసిన 19వ ఓవర్‌లో సింగిల్ తీసేందుకు అకాశం ఉన్నా, స్ట్రైయిక్ కోసం పరుగు తీయని అక్షర్ పటేల్, 20వ ఓవర్ మొదటి బంతికి అవుట్ అయ్యాడు.
12 బంతుల్లో ఓ ఫోర్‌తో 14 పరుగులు చేసిన అక్షర్ పటేల్, వెస్టిండీస్ టూర్‌లో మరో ఫెయిల్యూర్ పర్ఫామెన్స్ నమోదు చేశాడు. అర్ష్‌దీప్ సింగ్ వస్తూనే ఫోర్ బాదగా, రవి భిష్ణోయ్ సిక్సర్‌తో టీమిండియా స్కోరు బోర్డును 150 దాటించాడు. అర్ష్‌దీప్ సింగ్ 6, రవి భిష్ణోయ్ 8 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
