ఇదే నా చివరి ఐపీఎల్.. రోహిత్ శర్మ సంచలన వీడియో
Rohit Sharma: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఇదే తనకు చివరి ఐపీఎల్ సీజన్ అంటూ పేర్కొన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Rohit Sharma IPL Career : ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్ 2024 సీజన్ మరచిపోలేనిది. ఎందుకంటే సీజన్ ప్రారంభానికి నెలరోజుల ముందు, ఫ్రాంచైజీ తన కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను నియమించింది. తీవ్ర వివాదం రేపిన తర్వాత ఐదుసార్లు ముంబైకి టైటిల్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో గుజరాత్ జట్టు నుంచి హార్దిక్ పాండ్యాను తీసుకున్నారు. ఫ్రాంచైజీ నిర్ణయంతో సొంత అభిమానులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఐపీఎల్ 2024 ప్రారంభం అయిన తర్వాత ముంబై జట్టుపై ఈ నిర్ణయం తీవ్రంగా ప్రభావం చూపిందని చెప్పాలి. మెరుగైన ప్రదర్శనలు ఇవ్వకుండానే ప్లేఆఫ్ రేసు నుంచి ఇప్పటికే తప్పుకుంది.
అయితే, తన కెప్టెన్సీ గురించి ఎక్కడ పెద్దగా మాట్లాడని రోహిత్ శర్మ.. తాజాగా కేకేఆర్ కోచ్ తో మాట్లాడుతూ ఇదే తనకు చివరి ఐపీఎల్ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌కు ముందు, రోహిత్ శర్మ-కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌లు మాట్లాడుకుంటున్న వీడియో దృశ్యాలను కేకేఆర్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇందులో రోహిత్ శర్మ తనను కెప్టెన్సీ నుంచి తొలగించడం గురించి అసంతృప్తిని వ్యక్తంచేశాడు.
సంబంధిత వీడియో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ అన్ని విషయాలు మారుతున్నాయని అభిషేక్ నాయర్ తో చెప్పడం కనిపించింది. అలాగే, ఇది తనకు చివరి ఐపీఎల్ అని కూడా చెప్పడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. " ఏక్ ఏక్ చీజ్ చేంజ్ హో రహా హై...వో ఉంకే ఊపర్ హై...జో భీ హై వో మేరా ఘర్ హై భాయ్, వో టెంపుల్ జో హై నా మైనే బాన్‌వాయా హై (అంతా ఒక్కొక్కటిగా మారుతోంది... అది వారిపైనే.. ఏది ఏమైనప్పటికీ, ఇది నా ఇళ్లు.. ఇది నేను నిర్మించిన ఆలయం) అంటూ వీడియో చివరలో "భాయ్ మేరా క్యా మేరా టు యే లాస్ట్ హై (ఇదే నా చివరిది)" అని పేర్కొన్నాడు. అంటే ఐపీఎల్ లో రాబోయే సీజన్ లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరఫున కనిపించే అవకాశాలు లేనట్టేనని తెలుస్తోంది.
కేవలం ముంబై జట్టు నుంచి తప్పుకుంటాడా? లేదా పూర్తిగా ఐపీఎల్ కు వీడ్కోలు పలుకుతాడా? అనే దానిపై రోహిత్ శర్మ క్లారిటీ ఇస్తే గాని తెలియదు. అయితే, వచ్చే సీజన్ లో మరో టీమ్ నుంచి రోహిత్ ఆడతాడని క్రికెట్ వర్గాలు, అభిమానులు గట్టి నమ్మకంతో చెబుతుండటం గమనించాల్సిన విషయం. కాగా, ఈ ఐపీఎల్ 2024 లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఆడుతున్న ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా నిలిచింది. ప్రస్తుతం 10 జట్ల పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల ఆడిన ముంబై టీమ్ కేవలం 4 విజయాలు సాధించింది.