ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో 8 మ్యాచులు ఆడి 15 వికెట్లు పడగొట్టిన సైకా ఇషాక్.. పర్పుల్ క్యాప్ రేసులో ముంబై ఇండియన్స్ బౌలర్... 

ఎన్ని క్రికెట్ లీగ్‌లు వచ్చినా ఐపీఎల్ ప్లేస్ ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుంది. కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా వేల కోట్లు మాత్రమే కాదు, ఐపీఎల్ వెలిగితీసే కన్నీటి గాథలు... ఐపీఎల్ ద్వారా ఎందరో క్రికెటర్లు, వెలుగులోకి వచ్చి స్టార్ ప్లేయర్లుగా మారారు...

ఎక్కడో ఆస్ట్రేలియాలో క్లబ్ క్రికెట్ ఆడుకుంటున్న డేవిడ్ వార్నర్‌ని, ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌లో స్టార్ ప్లేయర్‌గా మారింది ఐపీఎల్.. హార్ధిక్ పాండ్యా, నటరాజన్, ఛేతన్ సకారియా.. ఇలా మారుమూల గ్రామంలో పుట్టి, చిన్నతనంలో ఎన్నో కష్టాలను అనుభవించిన క్రికెటర్లను ఓవర్‌నైట్ స్టార్లుగా మార్చేసింది ఇండియన్ ప్రీమియర్ లీగ్...

ఈ ఏడాది ప్రారంభమైన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కూడా ఈ విషయంలో సూపర్ సక్సెస్ అయ్యింది. డబ్ల్యూపీఎల్ కారణంగా మహిళా క్రికెటర్లకు జనాల్లో మంచి గుర్తింపు వచ్చింది. మిథాలీరాజ్, స్మృతి మంధాన తప్ప మరో మహిళా క్రికెటర్ తెలియనివారికి, డబ్ల్యూపీఎల్... ఉమెన్స్ క్రికెటర్ల గురించి ఎన్నో విషయాలు తెలిసేలా చేసింది...

అన్నింటికీ మించి ముంబై ఇండియన్స్ విజయాల్లో కీ రోల్ పోషిస్తున్న సైకా ఇషాక్, డబ్ల్యూపీఎల్ 2023 సీజన్‌లో 15 వికెట్లు తీసి.. పర్పుల్ క్యాప్ రేసులో నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో సైకా ఇషాక్ 2 వికెట్లు తీస్తే, పర్పుల్ క్యాప్ సొంతం చేసుకునే ఛాన్స్ చాలా ఉంటుంది..

కోల్‌కత్తాలోని పార్క్ సర్కస్ స్లమ్ ఏరియాలో పుట్టి పెరిగిన సైకా ఇషాక్.. ఎన్నో కష్టాలను అనుభవించింది. 2018లో ఆమె తండ్రి చనిపోయాడు. సైకా తల్లి ఇళ్లల్లో పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేది...

క్రికెట్ ఆడితే ఇచ్చే డబ్బులతోనే సైకా కుటుంబం కడుపునిండా తినగలిగేది. అయితే కరోనా కారణంగా క్రికెట్‌కి బ్రేక్ పడడంతో ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది.. అదీకాక ఆమె భుజానికి మూడేళ్ల క్రితం తీవ్ర గాయమైంది. ఈ గాయంతో బెంగాల్ టీమ్‌లో ఆమెకు చోటు దక్కేది కాదు. దీంతో క్రికెట్ నుంచి తప్పుకుని, ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకోవాలని అనుకుంది సైకా ఇషాక్...

భారత మాజీ క్రికెటర్ మిథూ ముఖర్జీ, సైకా క్రికెట్ కెరీర్‌ని మార్చేసింది. క్రికెట్ ద్వారా వచ్చే డబ్బులతోనే సైకా కుటుంబం ఆధారపడి ఉందని తెలుసుకున్న మిథూ ముఖర్జీ, ఆమెకి ఆర్థికంగా సాయం చేసేందుకు ముందుకొచ్చింది...

‘సైకా జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది. ఒకదాని మీద ఒకటి దెబ్బ మీద దెబ్బ పడుతూనే వచ్చాయి. బెంగాల్ సీనియర్స్ టీమ్‌లో చోటు కోల్పోయింది. ఆత్మవిశ్వాసం కోల్పోయింది. క్రికెట్ వదిలేయాలని అనుకుంది. అయితే ఆమెకి క్రికెట్ తప్ప మరేమీ తెలియదు...

వాళ్లది నిరుపేద కుటుంబం. ఆర్థిక సమస్యలతోనే చదువు కూడా మధ్యలోనే ఆపేసింది.. తన ఆటను నేను స్వయంగా చూశాను. ఆమె టీమిండియాకి ఆడాల్సిన ప్లేయర్. అందుకే నా చేతనైన సాయం చేశాను. ఆమె విజయం నిరుపేద కుటుంబంలో పుట్టి క్రీడల్లో రాణించాలని కలలు కనే ప్రతీ ఆడపిల్లకు స్ఫూర్తినిస్తుందని అనుకుంటున్నా...’ అంటూ చెప్పుకొచ్చింది మిథూ ముఖర్జీ..