లండన్: స్పిన్నర్ మొయిన్ అలీ టెస్టు మ్యాచుల నుంచి తప్పించడానికి కారణాన్ని ఇంగ్లాండు క్రికెట్ యాజమాన్యం వివరించింది. ఇటీవల ముగిసిన యాషెస్ సిరీస్ లో అతను ఒక్క టెస్టు మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఆ తర్వాత అతను మైదానంలోకి దిగలేదు. 

యాషెస్ సిరీస్ తొలి మ్యాచులో విఫలం కావడంతో మొయిన్ అలీని తర్వాత మ్యాచుల నుంచి తప్పించారు. మిగతా మ్యాచులకు అతని సేవలు మేనేజ్ మెంట్ కు అవసరమని అనిపించలేదు. న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక చేసిన టెస్టు జట్టులోకి కూడా అతన్ని తీసుకోలేదు. 

దాంతో మొయిన్ అలీ టెస్టులు ఆడబోడనే ప్రచారం ముమ్మరమైంది. అంతర్జాతీయ టెస్టు క్రికెట్ నుంచి అతను తప్పుకున్నట్లు కూడా పుకార్లు పుట్టాయి. దానిపై ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ ఆష్లే గైల్స్ వివరణ ఇచ్చారు. 

తాము కావాలని మొయిన్ అలీకి ఉద్వాసన పలకలేదని చెప్పాడు. టెస్టు క్రికెట నుంచి విరామం ఇవ్వాలని తమకు అలీ విజ్ఞప్తి చేశాడని, అంతే తప్ప ఎటువంటి రిటైర్మెంట్ కూడా ప్రకటించలేదని చెప్పారు. సాధారణమైన బ్రేక్ మాత్రమే ఇచ్చామని చెప్పారు. 

తాను కావాలని మొయిన్ గురించే ఈ విషయం చెప్పడం లేదని, తమకు సమ్మర్ అంతా సవాళ్లతో గడిచిందని ఆయన చెప్పారు. ప్రపంచ కప్, యాషెస్ లతో తమ క్రికెటర్లు తీవ్రంగా అలసిపోయారని చెప్పారు. అందులో భాగంగానే పలువురికి విశ్రాంతి ఇస్తున్నట్లు తెలిపారు.