Asianet News TeluguAsianet News Telugu

The Ashes: ట్రావిస్ హెడ్ ఎదురుదాడి.. పట్టు సడలించిన ఇంగ్లాండ్.. గబ్బా టెస్టులో పటిష్ట స్థితిలో ఆసీస్..

Australia Vs England: గబ్బా టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. తొలి టెస్టులో రెండో రోజు వార్నర్, లబూషేన్ తో పాటు సెంచరీ హీరో ట్రావిస్ హెడ్  లు రాణించడంతో ఆ జట్టు ఇంగ్లాండ్ కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించే పనిలో పడింది. 

The Ashes: Travis Head smashes century, Australia lead by 196 runs Against England
Author
Hyderabad, First Published Dec 9, 2021, 4:06 PM IST

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ లో భాగంగా బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి  టెస్టుపై ఆతిథ్య  జట్టు పట్టు బిగిస్తున్నది.  తొలి రోజు ఇంగ్లాండ్ ను తక్కువ పరుగులకే నిలువరించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ముందు తడబడినా తర్వాత పుంజుకుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కంగారూలు పటిష్ట స్థితిలో  నిలిచారు. ఆ జట్టు  ఆటగాడు ట్రావిస్ హెడ్.. ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. వన్డే తరహాలో ఆడి సెంచరీ సాధించాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్.. 7 వికెట్లు కోల్పోయి 343 పరుగులు చేసింది.  మరో మూడు రోజుల ఆట మిగిలుండటంతో ఈ టెస్టుపై ఆస్ట్రేలియాకు పట్టు చిక్కినట్టే అనిపిస్తున్నది. 

రెండో రోజు ఆటలో ట్రావిస్ ఇన్నింగ్సే హైలైట్.  95 బంతులే ఆడిన అతడు.. 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 112 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ముందు నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించిన  ట్రావిస్.. క్రమంగా జోరు పెంచి ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. ఒకవైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా ఏకాగ్రత కోల్పోకుండా సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు.  ట్రావిస్ దూకుడుతో ఈ టెస్టులో ఆసీస్..  తొలి ఇన్నింగ్స్ లో 196 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. 

 

వర్షం, వెలుతురు లేమి కారణంగా తొలి రోజు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిశాక ఆట సాధ్యం కాకపోవడంతో రెండో రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ కు ఆదిలోనే తొలి దెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్.. మార్కస్ హరిస్ (3) ను రాబిన్సన్ ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన లబూషెన్ (74).. వార్నర్ తో జతకలిసి ఇన్నింగ్స్ ను ముందుకు నడిపాడు. 117 బంతులు ఆడిన అతడు 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. మరో ఎండ్ లో మూడు లైఫ్ లు రావడంతో బతికిపోయిన డేవిడ్ వార్నర్ (94) కూడా నిలకడగా ఆడాడు. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 156 పరుగులు జోడించారు. కానీ జాక్ లీచ్ ఈ జంటను విడదీశాడు. 

ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్.. 12 పరుగులకే మార్క్ వుడ్ బౌలింగ్ లో కీపర్ జోస్ బట్లర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. యాషెస్ సిరీస్ లలో 2017 నుంచి (అడిలైడ్ టెస్టులో) ఇప్పటివరకు 20 పరుగుల కంటే తక్కువ స్కోరు చేయడం ఇదే ప్రథమం.  స్మిత్ ఔటవడంతో క్రీజులోకి వచ్చిన ట్రావిస్.. వార్నర్ తో కలిశాడు. కానీ వార్నర్.. సెంచరీకి ఆరు పరుగుల దూరంలో రాబిన్సన్ బౌలింగ్ లో స్టోక్స్ కు క్యాచ్ ఇచ్చాడు.  

 

ఆ వెంటనే వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (12) కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ కు చేరాడు. కానీ టెయిలెండర్స్ సాయంతో ట్రావిస్ సెంచరీ పూర్తి చేశాడు. ఆట ముగిసే సమయానికి ట్రావిస్ హెడ్,  మిచెల్ స్టార్క్ (10) లు క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో రాబిన్సన్ 3 వికెట్లు తీయగా.. మార్క్ వుడ్, జాక్ లీచ్, క్రిస్ వోక్స్ లు తలో వికెట్ దక్కించుకున్నారు.  అంతుకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 147 పరుగులకే ఆలౌట్ అయిన విషయం విదితమే. 

Follow Us:
Download App:
  • android
  • ios