Ben Stokes: యాషెస్ సిరీస్‌ నాలుగో టెస్టులో విచిత్ర సంఘటన... బంతి తగిలినా కదలని స్టంప్స్... కొత్త రూల్ తీసుకురావాలన్న సచిన్ టెండూల్కర్...

అదృష్టం ఉంటే ఆరడుగుల బుల్లెట్ వచ్చి తగిలినా ఏమీ కాన్నట్టు, వైడ్‌గా వెళుతుందనుకుని వదిలేసిన బంతి నేరుగా వెళ్లి వికెట్లను గీరాటేసిన అవుట్ కాకుండా బతికిపోయాడు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ 2021-22 క్రికెట్ ఫ్యాన్స్‌కి ఆశించినంత మజాని అందించలేకపోయినా, ఈ టెస్టు సిరీస్‌లో కొన్ని సంఘటనలు యావత్ క్రీడా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ చిత్రవిచిత్ర సంఘటన, యావత్ క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయి చూసేలా చేసింది...

ఆసీస్ పార్ట్ టైం బౌలర్ కామెరూన్ గ్రీన్ వేసిన ఓ బంతిని ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ వదిలేశాడు... అది కాస్తా వెళ్లి వికెట్లను తాకింది. వెంటనే ఆస్ట్రేలియా టీమ్ అప్పీలు చేయడం, ఫీల్డ్ అంపైర్ ఎల్బీడబ్ల్యూ అవుట్‌గా ప్రకటించడం జరిగిపోయాయి. అయితే తన కాలికి బంతి తగలలేదని తెలిసిన బెన్ స్టోక్స్‌ వెంటనే అంపైర్ నిర్ణయంపై ‘డీఆర్‌ఎస్’ రివ్యూ తీసుకున్నాడు...

టీవీ రిప్లైలో బెన్ స్టోక్స్‌ వదిలేసిన బంతి నేరుగా వెళ్లి వికెట్లను తాకినట్టు కనిపించడంతో అంతా అవాక్కయ్యారు. 120+ వేగంతో వచ్చిన బంతి తగిలినా, స్టంప్స్ ఏ మాత్రం కదలకపోవడం చూసి... ఆస్ట్రేలియా జట్టు షాక్ అయితే... తన అదృష్టాన్ని నమ్మలేక బెన్ స్టోక్స్‌ పెద్దగా నవ్వేశాడు... 

అంత వేగంగా వచ్చిన బంతి తగిలినా వికెట్లు కదలకపోవడాన్ని చూసిన డేవిడ్ వార్నర్, స్టంప్స్ దగ్గరికి వెళ్లి చేతులతో వాటిని కదిపి చూడడం... నవ్వులు పూయించింది...

ఈ సంఘటనపై భారత క్రికెటర్లు దినేశ్ కార్తీక్, సచిన్ టెండూల్కర్ కూడా తమదైన స్టైల్‌లో స్పందించారు. ‘ఆఫ్ స్టంప్‌ మీద పూర్తి భరోసాతో బ్యాట్స్‌మెన్ బంతిని వదిలేశాడు... అంతేనా బ్యాట్స్‌మెన్, బాల్‌ని కొట్టి ఉంటాడులే అని స్టంప్ కూడా పడడం మానేసింది...’ అంటూ కామెంట్ చేశాడు దినేశ్ కార్తీక్...

సచిన్ టెండూల్కర్ అయితే ఈ సంఘటన తర్వాత కొత్త రూల్ తేవాల్సిన అవసరం ఉందని ఫన్నీగా కామెంట్ చేశాడు. ‘లెగ్ బిఫోర్ వికెట్‌లాగా ‘హిట్టింగ్ ద స్టంప్స్’ అనే ఓ కొత్త చట్టాన్ని తేవాలనుకుంటా. ఎందుకంటే ఇలా స్టంప్స్‌కి బాల్ తగిలిన తర్వాత కూడా వికెట్ పడకపోతే ఎలా? మీరేం అంటారు... బౌలర్లకు న్యాయం జరగాలి కదా... ఏమంటావ్ వార్న్...’ అంటూ ఆసీస్ మాజీ దిగ్గజం షేన్ వార్న్‌ను ట్యాగ్ చేశాడు సచిన్ టెండూల్కర్...

Scroll to load tweet…

లక్కీగా బతికిపోయిన బెన్ స్టోక్స్ 91 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 66 పరుగులు చేసి నాథన్ లియాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 8 వికెట్ల నష్టానికి 416 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఉస్మాన్ ఖవాజా 137 పరుగులు చేయగా స్టీవ్ స్మిత్ 67 పరుగులతో రాణించాడు...

హసీబ్ హమీద్ 6, జాక్ క్రావ్లీ 18, డేవిడ్ మలాన్ 3 పరుగులు చేసి అవుట్ కాగా, గత ఏడాది టెస్టుల్లో 1700+ పరుగులు చేసిన ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ ఈ ఏడాదిని డకౌట్‌తో ఆరంభించాడు. 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో బెన్ స్టోక్స్, జానీ బెయిర్ స్టో కలిసి ఐదో వికెట్‌కి 128 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లాండ్‌ను ఆదుకున్నారు...

జానీ బెయిర్ స్టో 91 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 61 పరుగులతో క్రీజులో ఉండగా... ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకి ఇంకా 250+ పరుగుల దూరంలో ఉంది ఇంగ్లాండ్ జట్టు.