Australia Vs England: మూడో రోజు పటిష్టమైన స్థితిలో నిలిచిన జో రూట్ సేన.. నాలుగో రోజైన శనివారం కుప్పకూలింది. 74 పరుగుల వ్యవధిలోనే 8 వికెట్లు కోల్పోయి ఆసీస్ కు విజయాన్ని బంగారు పళ్లెంలో అందించింది.
రెండు అగ్రశ్రేణి క్రికెట్ జట్ల మధ్య పురాతన వైరంగా గుర్తింపు పొందిన యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ ను చిత్తు చిత్తుగా ఓడించింది. మూడో రోజు పటిష్టమైన స్థితిలో నిలిచిన జో రూట్ సేన.. నాలుగో రోజైన శనివారం కుప్పకూలింది. 74 పరుగుల వ్యవధిలోనే 8 వికెట్లు కోల్పోయి ఆసీస్ కు విజయాన్ని బంగారు పళ్లెంలో అందించింది. ఇంగ్లాండ్ విధించిన 20 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్.. ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. తాజా విజయంతో యాషెస్ సిరీస్ లో ఆసీస్ 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్.. 2 వికెట్లు మాత్రమే కోల్పోయి220 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్ మలన్, జో రూట్ ఉన్నారు. ఇద్దరు కలిసి 159 పరుగులు జోడించడం.. చేతిలో ఇంకా 8 వికెట్లుండటంతో ఇంగ్లాండ్ భారీ స్కోరు చేస్తుందని అందరూ భావించారు. కానీ నాలుగో రోజు తొలి సెషన్ లోనే ఆ జట్టుకు ఆసీస్ బౌలర్లు చుక్కలు చూపించారు.
అంతా భాగుందనేలోపే..
ఇన్నింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే జట్టు 223 పరుగుల వద్ద ఉండగా.. 82 పరుగులు చేసిన మలన్ ఔటయ్యాడు. స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్ లో అతడు లబూషేన్ కు క్యాచ్ ఇచ్చాడు. ఆ వెంటనే రూట్ (89) కూడాగ్రీన్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. ఆదుకుంటాడనుకున్న స్టోక్స్ (14) ను కమిన్స్ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత వికెట్ కీపర్ జోస్ బట్లర్ (23) తప్ప ఇంగ్లాండ్ ఆటగాళ్లు కనీస పోరాటం కూడా చేయకుండానే వెనుదిరిగారు. దీంతో 220-2 తో నాలుగో రోజు ప్రారంభించిన ఇంగ్లాండ్.. ఓవర్ నైట్ స్కోరుకు 77 పరుగులు జోడించి ఆలౌటైంది. లియాన్ కు 4 వికెట్లు దక్కగా.. కమిన్స్, గ్రీన్ కు తలో రెండు వికెట్లు దక్కాయి. ఇంగ్లాండ్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 5.1 ఓవర్లో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది.
లియాన్ మాయాజాలం..
నాలుగో రోజు ఆటలో లియాన్ ఆటే హైలైట్. ఏడాది కాలంగా వికెట్ లేక అల్లాడుతున్న అతడు.. ఈరోజు తొలి సెషన్ లో ఇంగ్లాండ్ ను పేకమేడలా కూల్చాడు. తొలుత ఇన్ ఫామ్ బ్యాటర్ మలన్ ను ఔట్ చేసిన అతడు.. ఆసీస్ తరఫున 400 వికెట్లు సాధించిన మూడో బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. షేన్ వార్న్ (708 వికెట్లు), మెక్ గ్రాత్ (563 వికెట్లు) లియాన్ కంటే ముందున్నారు. మలన్ ఔటవ్వడంతో ఇంగ్లాండ్ ఆ తర్వాత వికెట్లను ఆసీస్ పేస్ త్రయం కమిన్స్, స్టార్క్, హెజిల్వుడ్ కూల్చారు. నాథన్ లియాన్.. గతేడాది జనవరిలో ఇదే గబ్బా మైదానంలో భారత్ తో జరిగిన టెస్టులో వాషింగ్టన్ సుందర్ ను ఔట్ చేయడం ద్వారా 399 వికెట్లు సాధించాడు. కానీ ఆ తర్వాత సుమారు ఏడాది దాకా అతడు 400 వ వికెట్ కోసం వేచి చూడాల్సి వచ్చింది అయితే ఈ మధ్య కాలంలో ఆసీస్ ఎక్కువగా టెస్టులు కూడా ఆడలేదు. ఎట్లకేలకు యాషెస్ లో లియాన్ చరిత్ర సృష్టించాడు.
సంక్షిఫ్త స్కోరు: ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ - 147 ఆలౌట్
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ - 425 ఆలౌట్
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ - 297 ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ - 20/1
