Asianet News TeluguAsianet News Telugu

The Ashes: ప్చ్..! ముచ్చటగా మూడు ఛాన్సులొచ్చినా సెంచరీ మిస్ చేసుకున్న వార్నర్ భాయ్..

David Warner: క్రికెట్ లో అదృష్టం చాలా అరుదుగా వస్తుంది. అదీ క్రీజులో అయితే మరీ రేర్. అలాంటిది మూడు లైఫ్ లు లభించినా వార్నర్ భాయ్ మాత్రం సెంచరీ చేయలేకపోయాడు.  సరిగ్గా ఆరుఅడుగుల దూరంలో ఔటయ్యాడు. 

The Ahses: Australian Player David Warner and England s Haseeb Hameed involve in comedy of errors on Day 2
Author
Hyderabad, First Published Dec 9, 2021, 11:42 AM IST

యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా జరుగుతున్న తొలి టెస్టు  రెండో రోజు ఆటలో మూడు ఛాన్సులొచ్చినా డేవిడ్ వార్నర్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.  ఓసారి అంపైర్, రెండు సార్లు ఫీల్డర్లు అవకాశాలిచ్చిన  వార్నర్ మాత్రం ఆ ఛాన్సులను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సెంచరీకి దగ్గరగా వచ్చి ఆరు పరుగుల దూరంలో ఔటయ్యాడు.  చిత్ర విచిత్రంగా జరిగిన డేవిడ్ వార్నర్ మిస్సింగ్ ఛాన్సులు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. 

గబ్బా టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చిన డేవిడ్ వార్నర్ కు ఇంగ్లాండ్ ఆటగాళ్లు మూడు ఛాన్సులిచ్చారు.  ముందుగా.. ఆసీస్ ఇన్నింగ్స్ 12 వ  ఓవర్లో వార్నర్ 17 పరుగుల వద్ద ఉండగా బెన్ స్టోక్స్ బౌలింగ్ లో  క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కానీ అది నోబాల్ కావడంతో వార్నర్ ఊపిరిపీల్చుకున్నాడు. 

ఇక ఆ తర్వాత ఇన్నింగ్స్ 32 వ ఓవర్లో వార్నర్ భాయ్ 49 పరుగుల వద్ద ఉండగా.. అతడు ఇచ్చిన క్యాచ్ ను స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న  ఇంగ్లాండ్ ఓపెనర్ రోరీ బర్న్ నేలపాలు చేశాడు. అలా వార్నర్ కు రెండోసారి అదృష్టం వరించింది. 

 

ఇక  వార్నర్ 60 పరుగుల వద్ద ఉండగా ముచ్చటగా మూడోసారి కూడా అతడిని అదృష్టం వరించింది. మార్క్ వుడ్ బౌలింగ్ లో షాట్ ఆడిన వార్నర్ సింగిల్ కు ప్రయత్నించాడు. కానీ షార్ట్ లెగ్ లో  ఉన్న హసీబ్ హమీద్.. బంతిని అందుకున్నాడు.  దీంతో అలర్ట్ అయిన వార్నర్.. వెనక్కి తిరిగే క్రమంలో జారిపడ్డాడు.  ఈ సందర్భంలో బ్యాట్ కూడా జారిపోయింది.  మరోవైపు బంతిని వేగంగా అందుకున్న హమీద్.. వికెట్లకు గురి చూసి కొట్టాడు.  బంతి వికెట్లకు తగలడం ఖాయం అనుకున్నారంతా.. కానీ ఈసారి కూడా అదృష్టం వార్నర్ వైపే ఉంది. హమీద్ విసిరిన ఆ బంతి వికెట్ల పక్కనుంచి వెళ్లింది. ఒకవేళ ఆ బంతి వికెట్లను తాకితే వార్నర్ పని అయిపోయేదే. 

మూడు ఛాన్సులొచ్చినా వార్నర్ సెంచరీ చేయలేకపోయాడు.  ఇన్నింగ్స్ 55.2 ఓవర్లో.. వార్నర్ 94 పరుగుల వద్ద ఉండగా రాబిన్సన్ వేసిన బంతిని స్టోక్స్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

 

ఇక తొలి రోజు  ఇంగ్లాండ్ ను 147 పరుగులకే కట్టడి చేసిన ఆసీస్.. రెండో రోజు బ్యాటింగ్ లో ఫర్వాలేదనిపిస్తున్నది. టీ విరామం ముగిసేసరికి ఆ జట్టు 65 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (29 నాటౌట్) ఒక్కడే బ్యాటర్. మిగిలిన వాళ్లంతా బౌలర్లే. హెడ్ కు తోడుగా కెప్టెన్ పాట్ కమిన్స్ క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం ఆసీస్.. 89 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios