Pension Hike For former cricketers: మాజీ క్రికెటర్లు, సిబ్బందికి పెన్షన్లను డబుల్ చేస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. 

భారత క్రికెట్ కు సేవలందించిన మాజీ క్రికెటర్లు, అంపైర్లు, ఇతర సిబ్బందికి ఇస్తున్న పెన్షన్లను డబుల్ చేస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ విషయంపై బీసీసీఐ తగిన రీతిలో స్పందించడం.. లబ్దిదారులకు గణనీయంగా పెన్షన్లను పెంచడం పట్ల ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ (ఐసీఎ) స్పందించింది. పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా మాజీ క్రికెటర్లకు పెన్షన్లు పెంచడం వాళ్లకు ఊరటనిచ్చే విషయమని కొనియాడింది. 

ఇదే విషయమై ఐసీఎ అధ్యక్షుడు అశోక్ మల్హోత్రా మాట్లాడుతూ .. ‘బీసీసీఐ నిర్ణయాన్ని మా సభ్యులంతా స్వాగతిస్తున్నారు. దీనివల్ల చాలా మంది లబ్దిదారులు లబ్దిపొందుతారు. రోజురోజుకూ పెరుగుతున్న ఖర్చులు, ఆదాయాలు పడిపోతున్న వేళ ఈ నిర్ణయం మాకు ఎంతగానో సహాయపడుతుంంది.పెన్షన్లను పెంచాలని మేం చాలా కాలంగా బీసీసీఐని కోరుతున్నాం. ఇప్పటికైనా తగిన నిర్ణయం తీసుకున్నందుకు బోర్డుకు, ప్రత్యేకంగా సెక్రటరీ జై షాకు ప్రత్యేక కృతజ్ఞతలు..’ అని తెలిపారు. 

ఇక పెన్షన్ల పెంపుపై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ట్విటర్ వేదికగా స్పందించాడు. ‘బీసీసీఐకి కృతజ్ఞతలు. రిటైర్డ్ ఆటగాళ్లకు ఈ నిర్ణయం చాలా ఉపకరిస్తుంది. నా తండ్రి, మహ్మద్ తారిఫ్ కు పెన్షన్ వచ్చినప్పుడల్లా సంతోషిస్తాడు. డబ్బు జీవితంలో సెక్యూరిటీ, గుర్తింపును ఇస్తుంది..’ అని ట్వీట్ చేశాడు. 

Scroll to load tweet…

కాగా.. సోమవారం ఉదయం మాజీ క్రికెటర్లు, అంపైర్ల పెన్షన్ ను పెంచుతున్నట్టు బీసీసీఐ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీని ప్రకారం.. ప్రస్తుతం మాజీ క్రికెటర్లకు రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకూ పెన్షన్‌గా చెల్లిస్తోంది బీసీసీఐ. రిటైర్మెంట్‌కి ముందు సదరు క్రికెటర్ పొందిన కాంట్రాక్ట్‌, పొందిన వేతనం మీద ఆధారపడి వారికి చెల్లించే పెన్షన్‌ ఆధారపడి ఉంటుంది. నెలకు రూ.15 వేలు, రూ.22,500ల పెన్షన్ పొందే వారికి 100 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్ బోర్డు. 

అంటే ఇంతకుముందు రూ.15 వేలు తీసుకునే మాజీ క్రికెటర్లు, అంపైర్లు.. ఇకపై నెలకు రూ.30 వేలు అందుకోబోతున్నారు. అలాగే రూ.22,500ల మొత్తం అందుకునేవారికి రూ.45 వేలు బ్యాంకులో జమ కానుంది. రూ.30 వేలు తీసుకునే వారికి ఇకపై రూ.52,500, రూ.37,500లకు మొత్తం అందుకునేవారికి ఇకపై రూ.60 వేలు ఖాతాలో చేరనుంది. ఇంతకుముందు రూ.50 వేలు అందుకునే మాజీ క్రికెటర్లు ఇకపై రూ.70 వేలు అందుకోబోతున్నారు. భారత మాజీ పురుష, మహిళా క్రికెటర్లకు కూడా ఈ పెంచిన మొత్తం వర్తిస్తుంది.