IPL 2020 సీజన్‌లో మెన్స్ క్రికెటర్ల అద్భుత ఫీల్డింగ్ చిత్రాలు చాలానే చూశారు క్రికెట్ అభిమానులు. పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళల క్రికెట్‌లో ఇలాంటి సర్కస్ ఫీట్లు, డేంజరస్ స్టంట్లు చూసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మహిళల శారీరక నిర్మాణమే దీనికి కారణం.

అయితే జియో వుమెన్స్ టీ20 ఛాలెంజ్ ఫైనల్ మ్యాచ్‌లో కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది థాయిలాండ్ వుమెన్ క్రికెటర్ నట్టకన్ ఛాంటమ్. సూపర్ నోవాస్ బ్యాట్స్‌వుమెన్ జెమీమా రోడ్రిగ్స్ కొట్టిన షాట్‌ను బౌండరీ లైన్ దగ్గర అద్భుతంగా ఆపింది నట్టకన్. దాదాపు బౌండరీ లైన్‌ను బంతి తాకే సమయంలో కాళ్లు పైకి లేపి, చేతులతో బంతిని ఆపింది.

టీవీ రిప్లైలో ఈ సేవింగ్ చూసిన మహిళల క్రికెటర్లతో పాటు క్రికెట్ అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నట్టకన్ సేవింగ్ చూస్తుంటే నాకు నడుము విరిగినట్టు అనిపించిందని ఇంగ్లాండ్ క్రికెట్ కేట్ క్రాస్ అంటే... ‘నా మెడ విరిగినట్టు అనిపించిందని’ కామెంట్ చేసింది భారత ఆల్‌రౌండర్ వేదా కృష్ణమూర్తి.