ఒకప్పుడు ఐదు రోజుల పాటు జరిగే టెస్ట్ విభాగం కంటే  ఒక్క రోజులో ముగిసే వన్డేలపై అభిమానులు ఎక్కువగా ఆసక్తిని ప్రదర్శించేవారు. అయితే ఆ తర్వాత కేవలం మూడు గంటల్లో ముగిసే టీ20లపై అభిమానుల ఆసక్తి పెరిగింది. దీంతో టెస్టు క్రికెట్ మరింత ప్రమాదకర స్థాయికి దిగజారింది. ఇలా అభిమానులు ఆదరణను కోల్పోతున్న టెస్ట్ క్రికెట్ ను బ్రతికించే ప్రయత్నాలను ఐసిసి మొదలుపెట్టింది. అందుకు ఇంగ్లాండ్-ఆస్ట్రేలియాల మధ్య జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సీరిస్ ను ఎంచుకుంది. 

ఐసిసి ద్వారా అంతర్జాతీయ జట్లుగా గుర్తింపుపొందిన జట్లన్ని కౌన్సిల్ నిబంధనలకు తగ్గట్లు వ్యవహరించాల్సి వుంటుంది. అందులో భాగంగానే వన్డేల్లో ప్రతి జట్టు వేరు వేరు రంగుల జెర్సీలను కలిగివుంటుంది. దీంతో మైదానంలో ఏ జట్టు బ్యాటింగ్ చేస్తుంది...ఏ జట్టు ఫీల్డింగ్ చేస్తుందో అభిమానులు ఈజీగా గుర్తించవచ్చు. అంతేకాకుండా ప్రతి ఆటగాడి జెర్సీ వెనకాల పేరుతో పాటు వారు ఎంచుకున్న సంఖ్య వుంటుంది. దీన్ని బట్టి ఆ ఆటగాడెవరో చాలా సులువుగా గుర్తించవచ్చు. 

కానీ టెస్టుల్లో అలా కాదు. ఏ జట్టయినా తప్పనిసరిగా తెలుపు రంగు జెర్సీతోనే బరిలోకి దిగాల్సి వుంటుంది. అంతేకాకుండా వన్డేల మాదిరిగా  ఆటగాళ్లు టీషర్ట్ వెనకాల పేరు కానీ నంబర్ కానీ  వుండదు. దీంతో ముందే టెస్టులంటే బోరింగ్ అనే ఆలోచనతో వున్న అభిమానులు ఆటగాళ్లెవరో తెలుసుకోలేక కన్ప్యూజన్ కు గురవుతూ టెస్టులను వీక్షించేందుకే ఇష్టపడటం లేదు. దీంతో ముందుగా అభిమానుల్లో ఈ కన్ప్యూజన్ ను పోగొట్టేందుకు ఐసిసి చర్యలు ప్రారంభించింది. 

ఆటగాళ్ళ టెస్ట్ జెర్సీలపై వారి పేర్లు, ఇష్టమైన నంబర్ ముద్రించుకునే వెసులుబాటును ఐసిసి కల్పించింది. మరికొద్దిరోజుల్లో ప్రారంభంకానున్న ప్రతిష్టాత్మక యాషెస్ సీరిస్ నుండే ఆటగాళ్ల కొత్త జెర్సీ నిబంధన అమల్లోకి వస్తుంది. ఈ మేరకు తమ ఆటగాడు జో రూట్ టెస్ట్ జెర్సీపై తన పేరు, నంబర్ కలిగిన ఫోటోను ఇంగ్లాండ్ తన అధికారిక ట్వీట్టర్ ద్వారా పంచుకుంది.