మొదటి వన్డేలో స్లో ఓవర్ రేటు కారణంగా 20 శాతం మ్యాచ్ ఫీజు కోల్పోయిన టీమిండియాపై ఆసీస్ టూర్‌లో మరోసారి వేటు పడింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో స్లో ఓవర్ రేటు కారణంగా మరోసారి భారత జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది ఐసీసీ. నిర్ధిష్ట సమయానికి ఓ ఓవర్ తక్కువగా వేసినందుకు ఆర్టికల్ 2.22 నిబంధన ప్రకారం ఆటాళ్లకి జరిమానా పడింది. 

మరోవైపు ఆస్ట్రేలియాకి కూడా టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు షాక్ తగిలింది. రెండో వన్డే మ్యాచ్‌లో గాయపడిన ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇంకా కోలుకోని కారణంగా మొదటి టెస్టు మ్యాచ్‌కి దూరం కానున్నాడు. మరోవైపు ఆసీస్ యంగ్ ఓపెనర్ విల్ పుకోవిస్కి కూడా ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడడంతో మొదటి టెస్టు ఆడడం కష్టమే. 

ప్రాక్టీస్ మ్యాచ్ మూడో రోజు నాలుగో ఇన్నింగ్స్‌లో భారత యంగ్ బౌలర్ కార్తీక్ త్యాగి వేసిన బౌన్సర్, విల్ పుకోవిస్కి హెల్మెట్‌కి బలంగా తగిలింది. దీంతో మైదానంలో కుప్పకూలిపోయాడు పుకోవిస్కి. రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగిన పుకోవిస్కి, కోలుకోవడానికి రెండు వారాల సమయం పడుతుందని తెలిపారు వైద్యులు.