ఇటీవల జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో వరుస సెంచరీలతో చెలరేగి చరిత్ర సృష్టించాడు. అయితే రోహిత్ ప్రపంచ కప్ ప్రదర్శన నేపథ్యంలో క్రికెట్ ప్రియులు రోహిత్ కు సంబంధించిన ప్రతి విషయంపై ఆరా తీయడం ఆరంభించారు. ఈ క్రమంలోనే అతడు ప్రపంచ కప్ మెగా టోర్నీలో ఆ స్థాయి ప్రదర్శన చేయడం వెనుక వున్న రహస్యమేంటో బయటపడింది. 

రోహిత్ శర్మ గత రెండేళ్ల నుండి అసలు విరామమన్నదే ఎరగకుండా క్రికెట్ ఆడుతున్నాడు. మరీ ముఖ్యంగా అతడు టీ20, టెస్టుల కంటే వన్డేలపైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు. 2017 ఆగస్ట్ 1 నుండి ప్రపంచ కప్ ముగిసే వరకు టీమిండియా 111 వన్డే  మ్యాచులాడింది. వాటిల్లో రోహిత్ ఏకంగా 95 మ్యాచుల్లో ఆడి కేవలం 16 వన్డేలను మాత్రమే మిస్సయ్యాడు. ఇలా రెండేళ్ల కాలంలో అత్యధిక వన్డేలాడిన క్రికెటర్ గా రోహిత్ నిలిచాడు. టీమిండియా సారథి కోహ్లీని కూడా వెనక్కి నెట్టి అత్యధిక  వన్డేల ఘనతను రోహిత్ దక్కించుకున్నాడు. 

ఫిట్ నెస్ ను కాపాడుకుంటూ, గాయాలబారిన పడకుండా ఇలా అత్యధిక వన్డేల్లో పాల్గొనడం రోహిత్ కు మాత్రమే చెల్లిందని అభిమానులు ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా ప్రపంచ కప్ కు ముందు ఇలా విరామం లేకుండా ఆడటం వల్ల అతడికి మంచి ప్రాక్టీస్ లభించింది. అలా మంచి ఫామ్ ను అందిపుచ్చుకుని వరల్డ్ కప్ లో అడుగుపెట్టిన అతడు తన బ్యాట్ తో అద్భుతాలు చేయగలిగాడని క్రికెట్ పండితులతో పాటు క్రికెట్ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. 

ఇక టీమిండియా విషయానికి వస్తే అంతర్జాతీయ జట్లన్నింటిలో అత్యధిక వన్డేలాడిన ఘనతను ఈ జట్టు సాధించింది. రెండేళ్ల కాలంలో(ఆగస్ట్ 1 నుండి) భారత జట్టు 111 వన్డేలాడగా ఇంగ్లాండ్ 89 రెండో స్థానంలో, శ్రీలంక, పాకిస్థాన్ 88 మ్యాచులతో ఉమ్మడిగా మూడో స్థానంలో నిలిచాయి.