టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ గురువును మించిన శిష్యుడిగా పేరుతెచ్చుకున్నాడు. వికెట్  కీపింగ్, బ్యాటింగ్ లోనే కాదు ప్రతి విషయంలోనూ తనలాంటి యువ క్రికెటర్లు ధోనిని గురువుగా భావిస్తారని పంత్ పలు సందర్భాల్లో పేర్కొన్నాడు. అలా టీమిండియా సీనియర్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనిని చూసే క్రికెట్ మెలకువలు నేర్చుకున్నానని చెప్పే పంత్ అతడి రికార్డునే బద్దలుగొట్టాడు. అదీ ఒక్కసారి కాదు రెండుసార్లు.

అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఇప్పటివరకు వికెట్ కీపర్ గా అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డు ధోని పేరిట వుండేది. అతడు సాతాఫ్రికాతో సెంచూరియన్ వేదికన జరిగిన టీ20 మ్యాచ్ లో సాధించిన 52 పరుగులే ఇప్పటివరకు హయ్యెస్ట్. అయితే ధోని స్థానంలో వెస్టిండిస్ సీరిస్ కు ఎంపికైన రిషబ్ పంత్ మూడో టీ20లో అదరగొట్టాడు. గయానాలో జరిగిన ఈ మ్యాచ్ లో పంత్ 65 పరుగులతో నాటౌట్ నిలిచాడు. దీంతో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత వికెట్ కీపర్ పంత్ చరిత్ర సృష్టించాడు. 

అయితే రెండేళ్లక్రితమే ధోనీని పంత్ అధిగమించాడు.  బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో పంత్ 56 పరుగులతో రాణించాడు. ఇలా అప్పుడే ధోని రికార్డును బద్దలయ్యింది. తాజాగా విండీస్ పై 65 పరుగులు సాధించడం ద్వారా పంత్ తన రికార్డును మెరుగుపర్చుకున్నాడు. కానీ ధోనిని  మూడో స్థానంలోకి నెట్టాడు. పంత్ సాధించిన 65, 56 పరుగులు మొదటి రెండు స్థానాల్లో నిలవగా ధోని 52 పరుగులు ఆ తర్వాతి స్థానంలో నిలిచాయి.   

గయానా వేదికన జరిగిన చివరి టీ20 మ్యాచులో కూడా టీమిండియా అన్ని విభాగాల్లో ఆదిపత్యం ప్రదర్శించింది. ఈ మ్యాచ్ మొదట బౌలింగ్ లో దీపక్ చాహర్...ఆ తర్వాత లక్ష్యఛేదనలో కెప్టెన్ కోహ్లీ, వికెట్ కీపర్ రిషబ్ పంత్ అదరగొట్టారు. చాహర్ విండీస్ కు చెందిన ముగ్గురు టాప్ ఆర్డర్ వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. లక్ష్యఛేదనలో టీమిండియా కేవలం 27పరుగులకే ఓపెనర్లిద్దరికి కోల్పోయి క్లిష్ట సమయంలో వున్నపుడు కోహ్లీ(59 పరుగులు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి రిషబ్ పంత్(65 పరుగులతో నాటౌట్) తోడవడంతో భారత్ మరో ఐదు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.