తొలి టీ20 మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సునాయాస విజయం అందుకున్న టీమిండియా... హర్మన్‌ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ.. 

బంగ్లాదేశ్ పర్యటనని భారత మహిళా క్రికెట్ జట్టు, ఘన విజయంతో ఆరంభించింది. ఢాకాలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో ఇరగదీసిన హర్మన్‌ప్రీత్ కౌర్ టీమ్, 7 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మహిళా జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. శాంతి రాణి 26 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేయగా షమీనా సుల్తానా 13 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు చేసింది..

శోభనా మోస్తరీ 33 బంతుల్లో 2 ఫోర్లతో 23 పరుగులు చేయగా కెప్టెన్ నిగర్ సుల్తాన్ 7 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి రనౌట్ అయ్యింది. షోర్నా అక్తర్ 28 బంతుల్లో 2 సిక్సర్లతో 28 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా రితూ మోనీ 11 పరుగులు చేసి రనౌట్ అయ్యింది..

115 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో షెఫాలీ వర్మ వికెట్‌ని త్వరగా కోల్పోయింది టీమిండియా. మూడు బంతులు ఆడిన షెఫాలీ వర్మ, మరుఫా అక్తర్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యింది. సున్నాకే తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా..

వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ 14 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసి అవుట్ కావడంతో 21 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత జట్టును కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కలిసి ఆదుకున్నారు..

ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కి 70 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 34 బంతుల్లో 5 ఫోర్లతో 38 పరుగులు చేసిన స్మృతి మంధానా, సుల్తానా ఖటున్ బౌలింగ్‌లో స్టంపౌట్ కాగా యషికా భాటియాతో కలిసి మ్యాచ్‌ని ఫినిష్ చేసింది హర్మ‌న్‌ప్రీత్ కౌర్..

35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా యషికా భాటియా 9 పరుగులు చేసింది. 16.2 ఓవర్లలోనే మ్యాచ్‌ని ముగించిన టీమిండియా... మూడో టీ20 మ్యాచుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం అందుకుంది. హాఫ్ సెంచరీతో పాటు ఓ రనౌట్ చేసిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచింది. 

ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్, జూలై 11న ఢాకాలోనే జరగనుంది. ఆ తర్వాత జూలై 13న ఆఖరి టీ20 మ్యాచ్ ఆడే టీమిండియా, జూలై 16 నుంచి వన్డే సిరీస్‌లో పాల్గొంటుంది.