బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియాకి వరుసగా రెండో విజయం... లో స్కోరింగ్ గేమ్‌లో 8 పరుగుల తేడాతో గెలిచి టీ20 సిరీస్‌ని 2-0 తేడాతో కైవసం చేసుకున్న భారత మహిళా జట్టు..
బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని అందుకుని, టీ20 సిరీస్‌ని 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి టీ20 మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న భారత మహిళా జట్టు, రెండో టీ20లో 8 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 95 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి వికెట్‌కి పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ ఇద్దరూ వెంటవెంటనే అవుట్ అయ్యారు.
13 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన స్మృతి మంధాన, నహీదా అక్తర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యింది. ఆ తర్వాతి ఓవర్‌లో 14 బంతుల్లో 4 ఫోర్లతో 19 పరుగులు చేసిన షెఫాలీ వర్మని సుల్తానా ఖటున్ అవుట్ చేసింది. షెఫాలీ వర్మ అవుట్ అయిన తర్వాతి బంతికే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగింది. సుల్తానా ఖటున్ బౌలింగ్‌లో హర్మన్‌ప్రీత్ క్లీన్ బౌల్డ్ కావడంతో 33/0 స్కోరుతో ఉన్న భారత జట్టు, 33/3కి చేరుకుంది.
13 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులు చేసిన వికెట్ కీపర్ యషికా భాటియాని ఫహిమా ఖటున్ అవుట్ చేయగా 21 బంతులు ఆడినా 6 పరుగులే చేసిన హర్లీన్ డియోల్‌ని సుల్తానా ఖటున్ పెవిలియన్ చేర్చింది. 14 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసిన దీప్తి శర్మ, ఫహినా ఖటున్ బౌలింగ్‌లో అవుట్ కాగా 21 బంతులు ఆడిన జెమీమా రోడ్రిగ్స్ 8 పరుగులే చేసి అవుట్ అయ్యింది. 17 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసిన అమన్‌జోత్ కౌర్‌ని మరూఫా అక్తర్ పెవిలియన్ చేర్చింది.
పూజా వస్త్రాకర్ 7, మిన్నూ మణి 5 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. బంగ్లా బౌలర్లలో సుల్తానా ఖటున్ 3 వికెట్లు తీయగా ఫహిమా ఖటున్ రెండు వికెట్లు తీసింది. మరూఫా అక్తర్, నహీదా అక్తర్, రబేయా ఖాన్ తలా ఓ వికెట్ తీశారు...
96 పరుగుల ఈజీ టార్గెట్ కావడంతో బంగ్లా ఈజీగా గెలుస్తుందని అనిపించింది. అయితే భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో 20 ఓవర్లలో 87 పరుగులకే ఆలౌట్ అయ్యింది బంగ్లాదేశ్. దీంతో 8 పరుగుల తేడాతో టీమిండియాకి విజయం దక్కింది. షమీనా సుల్తానా 5, శాంతి రాణి 5, ముషిదా ఖటున్ 4, రితూ మోనీ 4 పరుగులు చేసి వెంటవెంటనే అవుట్ కావడంతో 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్..
షోర్నా అక్తర్ 7, నహీదా అక్తర్ 6 పరుగులు చేయగా కెప్టెన్ నిగర్ సుల్తానా 55 బంతుల్లో 2 ఫోర్లతో 38 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో సింగిల్ డిజిట్ స్కోరు దాటిన ఏకైక బ్యాటర్ నిగర్ సుల్తానానే. రబేయా ఖాన్, ఫహిమా ఖటున్, మరుఫా అక్తర్ డకౌట్ అయ్యారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో 18 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలోనే వచ్చాయి. భారత మహిళలు ఏకంగా 15 వైడ్లు సమర్పించారు.
దీప్తి శర్మ, షెఫాలీ వర్మ మూడేసి వికెట్లు తీయగా మిన్నూ మణి రెండు వికెట్లు తీసింది. తెలుగు క్రికెటర్, అనంతపురం అమ్మాయి బరెడ్డి అనూషకి ఓ వికెట్ దక్కింది.
ఆఖరి ఓవర్‌లో బంగ్లాదేశ్ విజయానికి 10 పరుగులు కావాల్సి వచ్చాయి. చేతిలో 4 వికెట్లు ఉండడంతో బంగ్లాదేశ్ గెలుస్తుందని అనుకున్నారంతా. అయితే మొదటి బంతికి రబేయా ఖాన్ రనౌట్ కాగా ఆ తర్వాత నహీదా అక్తర్, ఫహిమా ఖటున్, మురూఫా అక్తర్ వికెట్లు తీసిన షెఫాలీ వర్మ, చివరి ఓవర్‌లో కేవలం ఒకే పరుగు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది..
