ఇటీవలే అంతర్జాతీ క్రికెట్ నుండి రిటైరయిన టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ మళ్లీ బ్యాట్ పట్టాడు. రిటైర్మెంట్ ప్రకటన సమయంలోనే యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్ మాత్రమే దూరమవుతున్నానని....అంతర్జాతీయంగా జరిగే లీగుల్లో మాత్రం పాల్గొంటానని స్ఫష్టం చేశాడు. ఈ  క్రమంలోనే అతడు కెనడాలో జరగుతున్న గ్లోబల్ టీ20 లీగ్ లో పాల్గొన్నాడు. అయితే  రిటైర్మెంట్ తర్వాత మొదటిసారి బ్యాట్ పట్టుకున్న యువీ అభిమానులను ఆకట్టుకోలేకపోయాడు. 

ఈ టోర్నమెంట్ లో యువరాజ్ టొరంటో నేషన్స్ జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. గురువారం వెస్టిండిస్ క్రికెటర్ క్రిస్ గేల్ సారథ్యంలోని వాంకోవర్ నైట్స్ జట్టుతో తలపడ్డ యువీ సేన ఓటమిపాలయ్యింది. ముఖ్యంగా కెప్టెన్ యువరాజ్ 27 బంతుల్లో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే అతడు నాటౌట్ గా నిలిచినా తొందరపాటుతో మైదానాన్ని వీడినట్లు రీప్లేలో బయటపడింది. 

వాంకోవర్ బౌలర్ రిజ్వాన్ బౌలింగ్ ముందుకొచ్చి భారీ షాట్ ఆడటానికి యువీ ప్రయత్నించాడు. అయితే బంతి నేరుగా వికెట్ చేతిలో పడి ఆపై వికెట్లను తాకింది. అయితే యువరాజ్ మాత్రం బంతి నేరుగా వికెట్లకు తాకిందని భావించి మైదానాన్ని వీడాడు. అయితే అలా జరగలేదని రీప్లేలో ద్వారా బయటపడ్డా అప్పటికే అతడు మైదానాన్ని వీడటంతో ఔట్ గానే నిర్దారించాల్సి వచ్చింది. 

యువీ సారథ్యంలో ఆడిన మెక్ కల్లమ్, కీరన్ పొలార్డ్ లు కూడా ఆశించిన మేర రాణించలేకపోయారు. దీంతో మొదట బ్యాటింగ్ కు దిగిన టొరంటో టీం 20  ఓవర్లలో 159 పరుగులకే పరిమితమయ్యింది. అయితే లక్ష్యచేధనలో బ్యాట్ మెన్స్ వాల్టన్(59పరుగులు), డస్సెన్(65 పరుగులు) లు హాఫ్ సెంచరీలతో రాణించడంతో వాంకోవర్స్ జట్టు కేవలం 17.2 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.