టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ అనూహ్య రిటైర్మెంట్ ప్రకటనతో భారతీయ క్రికెట్లో భావోద్వేగపూరితమైన పరిస్థితులు నెలకొన్నాయి. అభిమానులు అతడి రికార్డులు, గెలిపించిన మ్యాచులు, ఉత్తమ ప్రదర్శల గురించి చర్చించుకుంటున్నారు. ఇక యువీతో పాటు టీమిండియా డ్రెస్సింగ్ రూం ను పంచుకున్న ఆటగాళ్లు అతడితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటారు. ఇలా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా యువీ రిటైర్మెంట్ పై ట్విట్టర్ వేదికన స్పందించాడు. 

''ఆటగాళ్లు వస్తుంటారు, పోతుంటారు...కానీ యువరాజ్ సింగ్  అలా కాదు. అతడిలాంటి  ఆటగాళ్లు చాలా అరుదుగా లభిస్తారు. ఎన్నో క్లిష్ట పరిస్థితులు అతడు ఎదుర్కొన్నాడు. అలా భయంకరమైన జబ్బు(క్యాన్సర్)ను, భయంకరమైన బౌలర్లను ఎదుర్కొని అందరి మనసులు దోచుకున్నాడు. తన పోరాటపటిమ, ఆత్మవిశ్వాసంతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. నీ  జీవితం  ఇకముందు కూడా సంతోషంగా సాగిపోవాలని కోరుకుంటున్నా. '' అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్టర్ ద్వారా యువరాజ్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. 

గతంలో కూడా యువరాజ్ క్యాన్సర్ తో బాధపడుతున్న సమయంలో సెహ్వాగ్ అతడికి అండగా నిలబడ్డాడు. ప్రాణాలతో పోరాడి విజయం సాధించిన అతన్ని పోరాటయోధుడిగా అభివర్ణించాడు. తాజాగా యువరాజ్ క్రికెట్ కు గుడ్ బై చెప్పి ఉద్వేగపూరితమైన పరిస్థితిలో వున్నపుడు సెహ్వాగ్ మరోసారి నైతికస్థైర్యాన్ని అందించే ప్రయత్నం చేశాడు.