జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదాను, ఆ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హక్కులను కల్పించే 370, 35ఏ నిబంధనను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే భారత అంతర్గత భూబాగంలో చేపట్టిన ఈ చర్యలను పాకిస్థాన్ అంతర్జాతీయ సమస్యగా సృష్టించే ప్రయత్నం చేస్తోంది. కశ్మీర్ ప్రజలపై  కపట ప్రేమను ప్రదర్శిస్తూ ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత ప్రభుత్వ చర్యలను తప్పుబట్టాడు. తాజాగా వివాదాస్పద పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూడా తమ ప్రధాని బాటలోనే నడిచాడు. 

''ఐక్యరాజ్య సమితి సమక్షంలో కశ్మీరీలకు ప్రత్యేక హక్కులు కల్పించబడ్డాయి. మనందరి లాగే స్వేచ్చగా జీవించే అవకాశాన్ని ఈ హక్కుల ద్వారా వారు పొందారు. అయితే ప్రస్తుతం కశ్మీలను మానవ హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తుంటే యూఎన్ఎ ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు మొద్దునిద్రను ప్రదర్శిస్తోంది?. అమెరికా అధ్యక్షుడు స్థానంలో వున్న డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించి కశ్మీరీ  హక్కులను కాపాడాలి.''  అంటూ అఫ్రిది 370 ఆర్టికల్ రద్దును ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు.  

ఇలా మన దేశంలో జరుగున్న ప్రస్తుత పరిణామాలపై అఫ్రిదీ చేసిన కామెంట్స్ పై టీమిండియా మాజీ క్రికెటర్, బిజెపి ఎంపి గౌతమ్ గంభీర్ సీరియస్ గా స్పదించాడు. 
''షాహిద్ అఫ్రిది... కశ్మీర్ లో మానవ హక్కుల ఉళ్లంఘన, హింసాత్మక వాతావరణం కొనసాగుతున్న మాట నిజమే. దాన్ని నువ్వు ఇప్పటికైనా గుర్తించి మంచిపని  చేశావు. అయితే ఇవన్నీ జరుగుతున్నది పాక్ ఆక్రమిత కశ్మీర్ లోనే అన్న విషయాన్ని కూడా అతడు గుర్తించాలి. ఈ విషయంపై నీవు అంతలా  బాధపడాల్సిన అవసరం లేదు...అతి త్వరలో ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాం.'' అంటూ అఫ్రిది వ్యాఖ్యలపై  గంభీర్ సెటైర్లు వేశాడు.