భారతదేశంలో ఎంతో ఆదరణ కలిగిన క్రికెట్ ను నాశనంచేసే దిశగా బిసిసిఐ వ్యవహరిస్తోందని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆరోపించారు. ఇప్పటికే చాలా అనాలోచిత నిర్ణయాలు తీసుకుని భారత క్రికెట్ ను దిగజార్చిన బిసిసిఐ ఇప్పుడు మరో తప్పుడు నిర్ణయం తీసుకుందన్నాడు. భారత క్రికెట్ కు ఎన్నో రకాలుగా సేవలందించిన, ఇప్పటికీ అందిస్తున్న దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కు నోటిసులివ్వడం బిసిసిఐ విపరీత దోరణిని సూచిస్తోందని సౌరవ్ గంగూలీ మండిపడ్డారు. 

రాహుల్ ద్రవిడ్ పరస్పర విరుద్ద ప్రయోజనాలు కలిగివున్న ఆరోపణలపై బిసిసిఐ స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆయనకు బిసిసిఐ ఎథిక్స్ విభాగం  నుండి నోటీసులు జారీ అయ్యాయి. ఇలా బిసిసిఐ తన సహచర క్రికెటర్ ని అవమానించడంపై సౌరవ్ గంగూలీ గరం అయ్యారు. 

''భారత క్రికెట్లో ఓ కొత్త ఫ్యాషన్ ప్రవేశించింది. వివాదాస్పద నిర్ణయాల ద్వారా బిసిసిఐ ప్రచారాన్ని పొంది నిత్యం వార్తల్లో నిలవాలని చూస్తోంది. ఇలా ప్రచారంకోసం ప్రాకులాడుతూ క్రికెట్ ను నాశనం చేస్తున్నారు. ఆ దేవుడే భారత  క్రికెట్ ను కాపాడాలి. ద్రవిడ్ పరస్పర విరుద్ద ప్రయోజనాలను కలిగివున్నాడన్న ఆరోపణలకు స్పందించి బిసిసిఐ ఎథిక్స్ అధికారులు నోటీసులు జారీ చేయడం సిగ్గుచేటు.''  అంటూ ద్రవిడ్  వ్యవహారంపై గంగూలీ ట్వీట్ చేశాడు. 

అయితే ఈ గంగూలీ ట్వీట్ పై టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్  కూడా స్పందించాడు. '' భారత క్రికెట్ ఎటుపోతుందో నిజంగా అర్థంకావడం లేదు. ఇండియన్  క్రికెట్ చరిత్రలో రాహుల్ ద్రవిడ్ కంటే మంచి వ్యక్తి వెతికినా దొరకడు. అలాంటి దిగ్గజ క్రికెటర్ కు నోటీసులు జారీచేయడం అవమానించడమే అవుతుంది. భారత క్రికెట్ మెరుగుపడాలంటే అతడి సేవలు ఎంతో  అవసరం. అలాంటి వ్యక్తిపైనే బిసిసిఐ చర్యలు తీసుకుంటోంది. ఇక భారత క్రికెట్ ను ఆ దేవుడే కాపాడాలి.'' అంటూ ద్రవిడ్ కు మద్దతుగా హర్భజన్ ట్వీట్ చేశాడు.     

మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌ ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీ (బెంగళూరు) డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. అలాగే బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్‌.శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్‌ గ్రూప్‌కు ఉపాధ్యక్షుడిగానూ పనిచేస్తున్నాడు. దీంతో అతడు నిబంధనలకు  విరుద్దంగా పరస్పర విరుద్ద ప్రయోజనాలను కలిగివున్నాడంటూ మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్  మెంబర్ సంజీవ్‌ గుప్తా బీసీసీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో  బోర్డు అంబుడ్స్‌మన్‌–ఎథిక్స్‌ ఆఫీసర్‌ రిటైర్డ్‌ జస్టిస్‌ డి.కె.జైన్‌ మంగళవారం ఈ నోటీసు జారీ చేశారు. దీనిపై ద్రవిడ్ రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

రాహుల్ ద్రవిడ్ కి బీసీసీఐ నోటీసులు