టీమిండియా లెజెండరీ క్రికెటర్, తొలి ప్రపంచ కప్ కలను సాకారం చేసిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కు మరో అరుదైన గౌరవం లభించింది. హర్యానాలో ఇటీవల ఏర్పాటుచేసిన సోర్ప్ట్ యూనివర్సిటీకి మొదటి ఛాన్స్‌లర్ గా ఆయన నియమితులయ్యారు. స్వరాష్ట్రానికి చెందిన  కపిల్ కు క్రీడల్లో వున్న అనుభవాన్న దృష్టిలో వుంచుకుని ఈ పదవిలో నియమిస్తున్నట్లు హర్యానా క్రీడా మంత్రి అనిల్ విజు ఓ ప్రకటించారు.

సోనిపేట్ జిల్లాలోని రాయ్ లో క్రీడా విశ్వావిద్యాలయ ఏర్పాటుకు ఇటీవలే హర్యానా రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇలా ప్రత్యేకంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని కలిగిన మూడవ రాష్ట్రంగా హర్యానా అవతరించింది. అంతకు ముందే గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు ప్రత్యేకంగా  కేవలం క్రీడల కోసమే ఓ యూనివర్సిటీని కలిగివున్నాయి. 

క్రీడల్లో మంచి ప్రతిభ కనబరుస్తూ దేశ ప్రతిష్టనే కాదు రాష్ట్రం పేరును తమ ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళుతున్నారు. అలా మరింత మంది యువ క్రీడాకారులను తీర్చిదిద్దడానికే ఈ  క్రీడా యూనివర్సిటీ ఏర్పాటుచేశామని మంత్రి అనిల్ తెలిపారు. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ఈ యూనివర్సిటీకి హర్యానా హరికేన్ కపిల్ ను ఛాన్స్‌లర్ గా నియమించాలని ప్రభుత్వం భావించింది.  అతడి సారథ్యంలో ఈ యూనివర్సిటీ ఉత్తమ క్రీడాకారులను  దేశానికి అందిస్తూ అభివృద్ది చెందుతుందని ఆశిస్తున్నామని అనిల్ విజు అభిప్రాయపడ్డారు..