కౌంటీ క్రికెట్‌లో స్టైలిష్ సెంచరీ బాదిన కరణ్ నాయర్... త్రిబుల్ సెంచరీ హీరోని పక్కనబెట్టేసిన టీమిండియా..

నార్తాంప్టన్‌షైర్ క్లబ్ తరుపున కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు కరణ్ నాయర్... సుర్రేతో మ్యాచ్‌లో 150 పరుగులు చేసిన టీమిండియా త్రిబుల్ సెంచరీ హీరో.. 

Team India triple Century hero Karun nair scores century in County Championship CRA

95 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో త్రిబుల్ సెంచరీ చేసిన బ్యాటర్లు ఇద్దరే. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టీమిండియా తరుపున టెస్టుల్లో త్రిబుల్ సెంచరీ బాదిన బ్యాటర్ కరణ్ నాయర్. అయితే త్రిబుల్ సెంచరీ తర్వాత కేవలం 3 టెస్టులు మాత్రమే ఆడిన కరణ్ నాయర్, టీమిండియాలో చోటు కోల్పోయాడు...

టీమిండియా, సెలక్టర్లు పట్టించుకోవడం మానేసిన కరణ్ నాయర్, కౌంటీల్లో సెంచరీతో అదరగొట్టాడు. ఛతేశ్వర్ పూజారా కెప్టెన్‌గా ఉన్న నార్తాంప్టన్‌షైర్ క్లబ్ తరుపున, కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు కరణ్ నాయర్. వార్‌విక్‌షైర్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 78 పరుగులు చేసిన కరణ్ నాయర్, తాజాగా సుర్రే క్లబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీ నమోదు చేశాడు..

నార్తాంప్టన్‌షైర్ క్లబ్ ప్లేయర్లు చేసిన తప్పిదాల కారణంగా కెప్టెన్ ఛతేశ్వర్ పూజారాపై ఒక్క మ్యాచ్ వేటు పడింది. దీంతో సుర్రేతో జరుగుతున్న మ్యాచ్‌లో అతను ఆడడం లేదు. హసన్ ఆజాద్ 151 బంతుల్లో 7 ఫోర్లతో 48 పరుగులు చేయగా ఎమిలో గే 16, కెప్టెన్ లూక్ ప్రొక్టెర్ 8 పరుగులు చేసి అవుట్ అయ్యారు..

ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన కరణ్ నాయర్ 246 బంతుల్లో 23 ఫోర్లు, 2 సిక్సర్లతో 150 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లు అందరూ వచ్చినట్టు వచ్చి పెవిలియన్ చేరుతున్నా, ఓ ఎండ్‌లో క్రీజులో పాతుకుపోయిన కరణ్ నాయర్... కౌంటీల్లో మొట్టమొదటి సెంచరీ బాదాడు..

రోబ్ కెగ్ 16, సైఫ్ జాయిబ్ 6, జస్టన్ బార్డ్ 17 పరుగులు చేయగా టామ్ టేలర్ 77 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 66 పరుగులు చేశాడు. బెన్ సాండర్సన్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. 150 పరుగులు చేసిన కరణ్ నాయర్ ఆఖరి వికెట్‌గా అవుట్ అయ్యాడు. 106.5 ఓవర్లు బ్యాటింగ్ చేసిన నార్తాంప్టన్‌షైర్, 357 పరుగులకి ఆలౌట్ అయ్యింది.. 

సుర్రే బౌలర్ టామ్ లూయిస్ 5 వికెట్లు తీయగా జామీ ఓవర్టన్‌కి 3 వికెట్లు దక్కాయి. ఈ సెంచరీతో కరణ్ నాయర్ పేరు మరోసారి ట్రెండింగ్‌లో నిలిచింది. వరుసగా ఫెయిల్ అవుతున్న కెఎల్ రాహుల్‌కి పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్న టీమిండియా, వన్డేల్లో కుదురుకోలేకపోతున్న సూర్యకుమార్ యాదవ్‌ని వన్డే వరల్డ్ కప్ ఆడిస్తోంది. త్రిబుల్ సెంచరీ చేసి రికార్డు క్రియేట్ చేసిన కరణ్ నాయర్‌ని ఎందుకు పక్కనబెట్టేశారని బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు అభిమానులు.. 


కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఎసెక్స్ క్లబ్ తరుపున ఆడుతున్న ఉమేశ్ యాదవ్, హంప్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 45 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేసి మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios