Asianet News TeluguAsianet News Telugu

అలా వచ్చి ఇలా వెళ్తున్న టీమిండియా బ్యాటర్లు.. వందకే సగం మంది పెవిలియన్ కు.. తీరు మారని కోహ్లి

England vs India: ఇంగ్లాండ్ తో రీషెడ్యూల్ టెస్టులో టీమిండియాకు తొలి రోజే కష్టాలు ఎదురయ్యాయి. వరుణుడు తేరుకున్నాక ఇంగ్లీష్ బౌలర్లు రెచ్చిపోతున్నారు.  టీమిండియా టాపార్డర్ దారుణంగా విఫలమైంది. వంద పరుగులు కూడా చేరకుండానే ఐదుగురు బ్యాటర్లు పెవిలియన్ కు చేరారు.

Team India Struggles, Lost 5 wickets Early in Edgbaston Test, Virat Kohli Flop Show Continues
Author
India, First Published Jul 1, 2022, 7:54 PM IST

‘వెళ్లొచ్చావా..?  ఉండు నేనూ వస్తున్నా..’ అన్నట్టుగా ఉంది ఎడ్జబాస్టన్ టెస్టులో ఘనత వహించిన టీమిండియా దిగ్గజ బ్యాటర్ల  ఆటతీరు. టాపార్డర్ లో ఒక్కరంటే ఒక్కరు కుదురుకోలేదు. ఒక్కరిలోనూ నిలబడాలన్న  కాంక్ష లేదు. ‘క్రీజులోకి వెళ్లడం.. పెవిలియన్ కు రావడం..’ అంతే. అంతకుమించి ఏం లేదు. కీలక ఎడ్జబాస్టన్ టెస్టులో ఇంగ్లాండ్ ఆహ్వానం మేరకు తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా బ్యాటర్లు వంద పరుగులకే సగం మంది పెవిలియన్ కు చేరారు. టాపార్డర్ దారుణంగా విఫలమైంది. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా..  ఓపెనర్లుగా శుభమన్ గిల్, ఛతేశ్వర్ పుజారాలను పంపింది. 24 బంతుల్లో 17 పరుగులు చేసిన శుభమన్ గిల్.. అండర్సన్ బౌలింగ్ లో జాక్ క్రాలేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక ఈ టెస్టుకు కొద్దిరోజుల ముందు ఇంగ్లాండ్ కౌంటీలలో టన్నుల కొద్దీ పరుగులు చేసిన పుజారా.. 46 బంతులాడి 13 పరుగులు చేసి అండర్సన్ బౌలింగ్ లో స్లిప్స్ లో క్రాలేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.  

కోహ్లీ.. పాత కథే.. 

46 పరుగులకే రెండు వికెట్లు పడటంతో హనుమా విహారితో కలిసి విరాట్ కోహ్లి (19 బంతుల్లో 11) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడతాడని ఆశించారు టీమిండియా ఫ్యాన్స్. అయితే లంచ్ కు ముందే వర్షం రావడంతో దాదాపు గంటకంటే ఎక్కువే మ్యాచ్ ఆగింది. మళ్లీ వరుణుడు శాంతించాక టీమిండియా బ్యాటింగ్ కు వచ్చింది. వర్షం వెలిశాక విహారి (20) ని మాథ్యూ పాట్స్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. 64 పరుగులకే మూడు వికెట్లు. ఆదుకుంటాడనుకున్న కోహ్లి ఆటతీరు మారలేదు. గత వైఫల్యాలను కొనసాగిస్తూ.. పాట్స్ వేసిన ఇన్నింగ్స్ 24.2 ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  71 పరుగులకే 4 వికెట్లు డౌన్.. 

 

అయ్యర్.. ప్చ్..

కోహ్లి నిష్క్రమించినా  శ్రేయస్ అయ్యర్ అయినా నిలుస్తాడని ఆశించిన టీమిండియా ఫ్యాన్స్ కు మరోసారి నిరాశే ఎదురైంది. 11 బంతులాడి  3 ఫోర్లు కొట్టి  15 పరుగులు చేసిన అయ్యర్ ను అండర్సన్ బోల్తా కొట్టించాడు. దీంతో అతడు కూడా పెవిలియన్ బాట పట్టాడు. 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది టీమిండియా.. 

టాపార్డర్ వైఫల్యంతో  భారత జట్టు ఆశలన్నీ ఇప్పుడు వికెట్ కీపర్ రిషభ్ పంత్ (18 నాటౌట్), రవీంద్ర జడేజా (6 నాటౌట్) మీదే ఉన్నాయి. డ్రింక్స్ బ్రేక్ సమయానికి 32 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 5 వికెట్ల నష్టానికి 109 గా ఉంది. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ 3, మాథ్యూ పాట్స్ 2 వికెట్లు తీశాడు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios