T20I World Cup 2022: టీ20 ప్రపంచకప్ సాధించడమే లక్ష్యంగా ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత జట్టు విజయంతో బోణీ కొట్టింది. వెస్టర్న్ ఆస్ట్రేలియాతో ముగిసిన ప్రాక్టీస్ మ్యాచ్ లో విజయం సాధించింది.
టీ20 ప్రపంచకప్ సాధనే లక్ష్యంగా ఆస్ట్రేలియాకు పయనమైన టీమిండియా.. ఆ దిశగా తొలి అడుగేసింది. పాకిస్తాన్ తో జరుగబోయే తొలి మ్యాచ్ (అక్టోబర్ 23) కు ముందు నాలుగు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడనున్న టీమిండియా.. తొలి మ్యాచ్ లో గెలుపు రుచి చూసింది. వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో భారత్.. 13 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే లక్ష్య ఛేదనలో వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టు.. 145 పరుగులకే పరిమితమైంది.
తొలుత బ్యాటింగ్ కు వచ్చిన భారత్ అనుకున్న స్థాయిలో రాణించలేదు. విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ విశ్రాంతి తీసుకున్న ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా రోహిత్ శర్మ, రిషభ్ పంత్ వచ్చారు. కానీ రోహిత్ 3 పరుగులే చేయగా రిషభ్ పంత్ 9 పరుగులకే ఔటయ్యాడు. వన్ డౌన్ లో వచ్చిన దీపక్ హుడా 22 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు.
అయితే నాలుగో స్థానంలో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 52) రాణించాడు. చివర్లో హార్ధిక్ పాండ్యా (22), దినేశ్ కార్తీక్ (19) ధాటిగా ఆడారు. ఫలితంగా భారత్.. 20 ఓవర్లకు 158 పరుగులు చేసింది.
అనంతరం వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టుకు భారత బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చుక్కలు చూపారు. అర్ష్‌దీప్ మూడు వికెట్లతో చెలరేగగా చాహల్ రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి పవర్ ప్లేలో 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆ జట్టును సామ్ ఫానింగ్ (59) ఆదుకున్నాడు. అయితే పరుగుల వేటలో ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. దీంతో 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్, చాహల్ తో పాటు భువనేశ్వర్ కుమార్ కూడా 2 వికెట్లు తీశాడు.
