బాక్సింగ్ డే టెస్టులో భారత క్రికెటర్లు ఎందుకు నల్ల బ్యాండ్లు ధరించారు?
IND vs AUS: బాక్సింగ్-డే టెస్ట్ రెండో రోజున భారత ఆటగాళ్లంతా నల్ల బ్యాండ్లు ధరించి మైదానంలోకి దిగారు. ఎందుకు ఇలా చేశారు?
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 నాలుగో మ్యాచ్ మెల్‌బోర్న్‌లో జరుగుతోంది. బాక్సింగ్ డే టెస్టు రెండో రోజున భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లంతా నల్ల బ్యాండ్లు ధరించి మైదానంలోకి దిగడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ఎందుకు ధరించారనే ప్రశ్న అందరి మదిలో మెదిలింది. దీని ప్రధాన కారణం భారత మాజీ ప్రధాని మరణం. గురువారం డిసెంబర్ 26న రాత్రి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణించారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు కమ్ముకున్నాయి. ఆయనకు నివాళిగా భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ళు నల్ల బ్యాండ్లు ధరించి బాక్సింగ్ డే టెస్టు రెండో రోజు ఆటను కొనసాగించారు.
దేశానికి ఎనలేని సేవలందించడంతో పాటు, ప్రపంచ వేదికపై భారత్ ను ఆర్థిక శక్తిగా నిలబెట్టిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను గురువారం ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ రాత్రి 10 గంటలకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మన మధ్య లేరనే వార్త వెలువడింది.
డాక్టర్ మన్మోహన్ సింగ్ సమయంలో అనేక ఆర్థిక సంస్కరణలు
2004 నుంచి 2014 వరకు దాదాపు 10 ఏళ్లు డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత ప్రధానిగా పనిచేశారు. తన పదవీకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు ఎనలేని సేవలందించారు. ఆర్థిక మంత్రిగా కూడా ఆయన అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థను కొత్తమార్గంలో ముందుకు నడిపిస్తూ ప్రగతి దిశలోకి తీసుకువచ్చారు. సమాచార హక్కు చట్టం, 100 రోజుల కరువు పని చట్టాలతో పాటు మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకువచ్చారు. భారత దేశానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ళు బాక్సింగ్ డే టెస్ట్ రెండో రోజున నల్ల బ్యాండ్లు ధరించి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించారు.
మన్మోహన్ సింగ్ కు మాజీ క్రికెటర్ల నివాళి
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంపై పలువురు మాజీ క్రికెటర్లు కూడా సంతాపం వ్యక్తం చేశారు. హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, వంటి భారత దిగ్గజ క్రికెటర్లు డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించారు.
రెండో రోజూ ఆధిపత్యం చూపిస్తున్న ఆస్ట్రేలియా
ఇదిలావుండగా, బాక్సింగ్ డే టెస్ట్ లో మొదటి రోజుతో పాటు రెండో రోజు కూడా ఆస్ట్రేలియా భారత్ పై పట్టు బిగించింది. కంగారు టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 476 పరుగులు చేసి ఆలౌట్ అయింది. స్టీవ్ స్మిత్ 140 పరుగులతో సెంచరీ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. బుమ్రా 4 వికెట్లు, రవీంద్ర జడేజా 3 వికెట్లు తీసుకున్నారు. భారత జట్టు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. అప్పుడే భారత్ కు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 3 పరుగులకే పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ 24 పరుగులు చేసి ఔట్ అయ్యారు. భారత్ 59 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది.