అండర్-19 ఆసియా కప్ ఫైనల్: ఉత్కంఠపోరులో భారత్ దే విజయం
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్ అండర్ 19 జట్టు అదరగొట్టింది.ఆసియా కప్ టోర్నీ ఫైనల్లో బంగ్లాదేశ్ ను చిత్తుచేసిన దృవ్ సారథ్యంలోని భారత జట్టు ట్రోఫీని అందుకుంది.

శ్రీలంక వేదికన జరిగిన అండర్-19 ప్రపంచ కప్ లో భారత యువ జట్టు అదరగొట్టింది. టోర్నీ ఆరంభం నుండి అద్భుత విజయాలతో ఫైనల్లోకి దూసుకెళ్లిన దృవ్ సేన చివరి మ్యాచ్ లో అయితే మాయ చేసింది. కేవలం 107 పరుగులను స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించనివ్వకుండా బంగ్లాదేశ్ ను కట్టడి చేసిన భారత్ ఆసియా కప్ ను ఒడిసిపట్టుకుంది.
కొలంబో లోని ప్రేమదాస స్టేడియం వేదికన జరిగిన ఫైనల్లో భారత్ మొదట బ్యాటింగ్ చేపట్టింది. అయితే బంగ్లాదేశ్ బౌలర్లు విజృంభించడంతో కేవలం 32.4ఓవర్లకే 106 పరుగులు చేసి ఆలౌటయ్యింది. కెప్టెన్ దృవ్ 33, కరణ్ లాల్ 37 పరుగులు చేసి ఆదుకోవడంతో టీమిండియా ఈ మాత్రమైనా పరుగులు సాధించగలిగింది.
భారత్ నిర్దేశించిన 107 పరుగులు లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లా ఘోరంగా విఫలమయ్యింది. భారత బౌలర్లు అధర్వ అన్కోలేకర్ కేవలం 28 పరుగులు మాత్రమే సమర్పించుకుని 5 వికెట్ల పడగొట్టి బంగ్లా వెన్ను విరిచాడు. అతడికి తోడు ఆకాశ్ సింగ్ కేవలం 12 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరి విజృంభణతో బంగ్లా పులులు తోక ముడుచుకున్నాయి. కేవలం 33 ఓవర్లకే 101 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయ్యింది. దీంతో భారత జట్టు విజేతగా నిలిచింది.
అతి తక్కువ లక్ష్యాన్ని బంగ్లా సునాయాసంగా ఛేదిస్తుందని అందరు భావించారు. కానీ అందరి ఆలోచనలను తలకిందులు చేస్తూ భారత్ కు అద్భత విజయాన్ని కట్టబెట్టిన అధర్వ ''మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'' గా నిలిచాడు.
బంగ్లా బ్యాట్స్ మెన్స్ లో కెప్టెన్ అక్బర్ అలీ 23, మిథున్ 21 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. మిగతా ఆటగాళ్లలో కనీసం రెండంకుల స్కోరు కూడా సాధించలేకపోయారు. ఇలా ప్రతిష్టాత్మక అండర్ 19 ఆసియా కప్ ట్రోఫీ భారత ఖాతాలోకి చేరింది.