Asianet News TeluguAsianet News Telugu

టీమిండియాకి దెబ్బ మీద దెబ్బ... స్లో ఓవర్‌ రేటు కారణంగా జరిమానాతో పాటు పాయింట్ల కోత వేసిన ఐసీసీ...

ఇంగ్లాండ్‌తో నిర్ణయాత్మక ఐదో టెస్టులో స్లో ఓవర్ రేటు కారణంగా టీమిండియాకి 40 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించిన ఐసీసీ... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్లలోనూ వేటు..

Team India fined 40 Percent match fee along with 2 points cut in WTC for Slow Over rate
Author
India, First Published Jul 5, 2022, 7:43 PM IST

ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఇంగ్లాండ్ చేతుల్లో ఊహించని పరాభవాన్ని మూటకట్టుకున్న భారత జట్టుకి, మరో షాక్ తగిలింది. ఇంగ్లాండ్‌తో రెండో ఇన్నింగ్స్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా భారత జట్టుపై భారీ జరిమానాతో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 2 పాయింట్ల కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఐసీసీ...

స్లో ఓవర్ రేటు కారణంగా భారత జట్టు ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 40 శాతం జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్ పాయింట్లలో 2 పాయింట్లను కోత విధించింది. ఇప్పటికే రెండు సార్లు స్లో ఓవర్ రేటు కారణంగా పాయింట్లు కోల్పోయిన భారత జట్టు, మూడో సారి ఈ వేటుకి గురి కానుంది.. ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు ఏకంగా ఆరు సార్లు, స్లో ఓవర్ రేటు కారణంగా పాయింట్లు కోల్పోవడం విశేషం...

ప్రస్తుతం 2021-23 సీజన్‌లో ఒక్క పరాజయం కూడా ఎదుర్కోని ఆస్ట్రేలియా,  డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా ఇప్పటిదాకా 9 టెస్టు మ్యాచులు ఆడి 6 విజయాలు అందుకుంది. 3 మ్యాచులను డ్రా చేసుకుంది...

ఆస్ట్రేలియా విజయాల శాతం 77.78 కాగా సౌతాఫ్రికా 7 మ్యాచుల్లో 5 విజయాలు, 2 పరాజయాలు అందుకుని 71.43 విజయాల శాతంతో రెండో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టుని ఓడినా, అంతకుముందు రెండు టెస్టుల్లో గెలిచిన భారత జట్టు సిరీస్‌ని 2-2 తేడాతో డ్రా చేసుకుంది...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2021-23 సీజన్‌లో 12 టెస్టులు ఆడిన టీమిండియా, 6 విజయాలు అందుకుని, 4 మ్యాచుల్లో ఓడింది. 2 టెస్టులను డ్రా చేసుకోగలిగింది. ప్రస్తుతం 53.47 విజయాల శాతంతో ఉన్న భారత జట్టు మూడో స్థానంలో ఉండగా 7 టెస్టులు ఆడి 3 గెలిచి, రెండింట్లో ఓడి, రెండు టెస్టులను డ్రా చేసుకున్న పాకిస్తాన్.. 52.38 విజయాల శాతంతో టాప్ 4లో ఉంది...

వెస్టిండీస్ 9 టెస్టులు ఆడి 4 విజయాలతో ఐదో స్థానంలో ఉండగా 7 టెస్టులు ఆడి 3 విజయాలు అందుకున్న శ్రీలంక ఆరో స్థానంలో ఉంది. మూడు వారాలకు ముందు 12 టెస్టుల్లో ఒకే ఒక్క విజయం అందుకుని, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న ఇంగ్లాండ్... వరుసగా నాలుగు టెస్టుల్లో గెలిచి టాప్ 7లోకి ఎంట్రీ ఇచ్చింది...

16 టెస్టులు ఆడి 5 విజయాలు అందుకున్న ఇంగ్లాండ్, 7 టెస్టుల్లో ఓడి 4 టెస్టులను డ్రా చేసుకోగలిగింది. ఐసీసీ మొట్టమొదటి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన న్యూజిలాండ్, ఈసారి పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. డబ్ల్యూటీసీ 2021-23 సీజన్‌లో 9 టెస్టులు ఆడి 2 విజయాలు అందుకున్న న్యూజిలాండ్, 6 టెస్టుల్లో ఓడింది. ఓ టెస్టు డ్రా చేసుకుని 25.93 విజయాల శాతంతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది. 10 టెస్టుల్లో ఒకే ఒక్క టెస్టు గెలిచి 8 టెస్టుల్లో ఓడి ఓ టెస్టు డ్రా చేసుకున్న బంగ్లాదేశ్... ఆఖరి స్థానంలో ఉంది...

ఆస్ట్రేలియాతో పాటు సౌతాఫ్రికా, ఇండియా, పాకిస్తాన్ జట్లకు ఫైనల్ చేరేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఒక్క పరాజయం కూడా అందుకోని ఆస్ట్రేలియా, మరో రెండు టెస్టు సిరీస్‌లు గెలిస్తే... నేరుగా ఫైనల్‌కి అర్హత సాధించగలుగుతుంది...

Follow Us:
Download App:
  • android
  • ios