5 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసి డిక్లేర్ చేసిన టీమిండియా... వెస్టిండీస్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగుల భారీ ఆధిక్యం.. 

డొమినికా టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌‌లో 152.2 ఓవర్లు బ్యాటింగ్ చేసి 5 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకి ఆలౌట్ కావడంతో భారత జట్టుకి 271 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. విండీస్ ఇన్నింగ్స్ తేడా ఓటమి నుంచి తప్పించుకోవాలంటే 271 పరుగులు చేయాల్సి ఉంటుంది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ బ్యాటింగ్ చూసిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 200 పరుగులు చేసినా ఎక్కువే..

312/2 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, మరో 109 పరుగులు జోడించి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి టెస్టు ఆడుతున్న యశస్వి జైస్వాల్ 387 బంతుల్లో 16 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 171 పరుగులు చేసి... రికార్డు సెంచరీ బాదాడు. కొన్నాళ్లుగా పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న కెప్టెన్ రోహిత్ శర్మ 221 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 103 పరుగులు చేసి.. టెస్టుల్లో 10వ సెంచరీ నమోదు చేసుకున్నాడు..

రోహిత్ శర్మ టెస్టు కెరీర్‌లో ఇదే స్లోయెస్ట్ సెంచరీ. బీభత్సమైన ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్, 11 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అజింకా రహానే 11 బంతుల్లో 3 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. 182 బంతుల్లో 5 ఫోర్లతో 76 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, 76వ సెంచరీని అందుకోలేకపోయాడు.. 

రవీంద్ర జడేజా 82 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 37 పరుగులు చేయగా తొలి టెస్టు ఆడుతున్న ఇషాన్ కిషన్‌ బ్యాటింగ్ కోసం కాసేపు ఇన్నింగ్స్ డిక్లరేషన్‌ని వాయిదా వేసింది టీమిండియా. కోహ్లీ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్, 20 బంతులు ఆడిన తర్వాత సింగిల్ తీశాడు. ఇషాన్ కిషన్ సింగిల్ తీయగానే, ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించాడు కెప్టెన్ రోహిత్ శర్మ..

విండీస్ ఈ ఇన్నింగ్స్‌లో ఏకంగా 9 మంది బౌలర్లను ప్రయోగించింది. కీమరో రోచ్, అల్జెరీ జోసఫ్, రహ్కీమ్ కార్న్‌వాల్, వర్రీకాన్‌, అలిక్ అతనజేలకే తలా ఓ వికెట్ దక్కింది.