టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ, బౌలర్ చాహల్ వెస్టిండీస్‌తో జరగనున్న రెండో టీ20లో అరుదైన రికార్డులపై కన్నేశారు. పొట్టిఫార్మాట్‌లో 400 సిక్సర్ల క్లబ్‌లో చేరడానికి హిట్ మ్యాన్ ఒక సిక్సర్ దూరంలో మాత్రమే నిలిచాడు.

మరో సిక్సర్ బాదితే టీ20లలో 400 సిక్సర్లు సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లలో విండీస్ వీరుడు క్రిస్‌గేల్ 534, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహీద్ అఫ్రీది 476 సిక్సర్లతో రెండో స్థానంలో నిలిచారు. ఇక టీ20ల్లో అత్యధిక పరుగుల రికార్డు కోసం కోహ్లీ, రోహిత్ పోటీపడుతున్నారు.

Also Read:విలియమ్స్ కి విరాట్ కోహ్లీ నోట్ బుక్ పంచ్..

ఇప్పటికే రోహిత్ 2,547 పరుగులతో టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత 2,544 పరుగులతో కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. దీనితో పాటు మరో అరుదైన రికార్డుపై కోహ్లీ కన్నేశాడు.

ఇంకో 25 పరుగులు సాధిస్తే స్వదేశంలో పొట్టి ఫార్మాట్‌లో వెయ్యి పరుగులు సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. కోహ్లీ కంటే ముందు కీవీస్ ఆటగాళ్లు మార్టిన్ గప్టిల్ 1,430, కోలిన్ మన్రో 1000 మాత్రమే ఇప్పటి వరకు స్వదేశంలో టీ20లలో స్వదేశంలో వెయ్యి పరుగులు సాధించారు.

Also read:ఇప్పుడు సారథిగా కాదు...సహయజమానిగా:గంభీర్ నయా ఇన్నింగ్స్

బ్యాట్స్‌మెన్లతో పాటు టీమిండియా బౌలర్ యజువేంద్ర చాహల్ కూడా మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇంకో వికెట్ తీస్తే టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. 35 ఇన్నింగ్సుల్లో 52 వికెట్లు తీసిన చాహల్.. ప్రస్తుతం రవిచంద్రన్ అశ్విన్‌తో సమంగా నిలిచాడు.