న్యూఢిల్లీ : భారత మాజీ ఓపెనర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ ఐపీఎల్‌లో ఓ ప్రాంఛైజీకి సహ యజమాని కానున్నాడా? పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఇందు కోసం కొంత కాలంగా గంభీర్‌ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. 

ఐపీఎల్‌ కెరీర్‌ను ఢిల్లీ డెర్‌డెవిల్స్‌తో ఆరంభించిన గంభీర్‌ మూడేండ్ల తర్వాత కోల్‌కత నైట్‌రైడర్స్‌కు మారాడు. కోల్‌కతకు గంభీర్‌ రెండు ఐపీఎల్‌ టైటిళ్లు అందించాడు. 2018 సీజన్‌లో తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌ గూటికి చేరుకున్నాడు. 

Also read: నిత్యానంద కొత్త దేశం... వీసా ఎలా పొందాలంటూ అశ్విన్ ట్వీట్

సీజన్‌ మధ్యలోనే శ్రేయస్ అయ్యర్‌కు సారథ్య పగ్గాలు అప్పగించిన గంభీర్‌... గౌరవప్రదంగా డ్రెస్సింగ్‌రూమ్‌కు పరిమితమయ్యాడు. 2019 సీజన్లో నాటికి గంభీర్ ఎంపీ గా పోటీ చేసే పనిలో బిజీ అయిపోవడం. ఆ తరువాత బీజేపీలో చేరడం, ఈస్ట్ ఢిల్లీ టికెట్ దక్కించుకోవడం ఎంపీగా గెలవడం చక చకా జరిగిపోయాయి. 

2019 సీజన్‌కు ముందు జెఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌ గ్రూప్‌, ఢిల్లీ ప్రాంఛైజీలో 50 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందు కోసం రూ. 550 కోట్ల ఒప్పందం చేసుకుంది. మరో 50 శాతం వాటాను  జీఎంఆర్‌ కలిగి ఉంది. 

Also read: విలియమ్స్ కి విరాట్ కోహ్లీ నోట్ బుక్ పంచ్..

గౌతం గంభీర్‌ ఇప్పుడు జీఎంఆర్‌తో చర్చలు సాగిస్తున్నాడు. పది శాతం వాటా కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. పది శాతం వాటాకు గౌతం గంభీర్‌ సుమారు రూ. 100 కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాడని సమాచారం. 

గౌతం గంభీర్‌ నుంచి ఈ విషయంపై ఎటువంటి స్పందన లేదు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్‌ వాటా కొనుగోలు చర్చలను ధ్రువీకరించింది. త్వరలోనే గౌతం గంభీర్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ సహా యజమానికి ఒప్పందం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.