నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ రైతులు కొనసాగిస్తున్న ఉద్యమానికి ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకు మద్దతు ఇస్తున్నారు.

ఇప్పటికే పంజాబ్, హర్యానాలకు చెందిన పలువురు క్రీడాకారులు, కోచ్‌లు తమకు ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు, రివార్డులను వెనక్కి ఇచ్చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

తాజాగా టీమిండియా క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ కుటుంబం రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు ఆయన తండ్రి లఖ్వీందర్‌ సింగ్‌ పేర్కొన్నారు. కాగా గిల్‌ ప్రస్తుతం ఆసీస్‌ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. 

తన తండ్రి రైతులు చేస్తున్న ఆందోళనలో పాల్గొంటానని ఇంట్లో నుంచి బయలుదేరారు. కానీ ఆయన ఆరోగ్యం దృష్ట్యా  ఒకసారి ఆలోచించమని చెప్పిన తర్వాత తన ఆలోచనను విరమించుకున్నారని లఖ్వీందర్ తెలిపారు.

తాము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చామని.. గిల్‌ చిన్ననాటి నుంచే వ్యవసాయం అంటే ఎంతో ఇష్టపడేవాడని ఆయన పేర్కొన్నారు. తాతలు, మామల దగ్గర్నుంచి వ్యవసాయం అంటే ఎంటో ప్రత్యక్షంగా నేర్చుకున్నాడని లఖ్వీందర్ చెప్పాడు.

శుభమన్‌ గిల్‌కు సొంతూరంటే చెప్పలేనంత ఇష్టం..  ఎక్కువగా పంట పొలాల్లోనే తన క్రికెట్ ప్రాక్టీస్‌ను చేసుకునేవాడని ఆయన గుర్తుచేసుకున్నారు. ఒకవేళ గిల్‌  క్రికెటర్‌ కాకపోయుంటే ఖచ్చితంగా రైతు అయ్యేవాడని తేల్చి చెప్పారు.

కాగా, క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఊళ్లో ఉన్న వ్యవసాయక్షేత్రానికి వెళ్లిపోతానని గిల్‌ చాలా సందర్భాల్లో తనతో చెప్పాడని లఖ్వీందర్ వెల్లడించారు. ఇప్పుడు నా కొడుకు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

గిల్‌ ఆటను ఒక పక్క టీవీలో ఎంజాయ్‌ చేస్తూనే రైతుల ఉద్యమానికి మా వంతు సంఘీబావం ప్రకటించామన్నారు. తాము రైతులకు ఇస్తున్న మద్దతును గిల్‌ తప్పకుండా అర్థం చేసుకుంటాడని ఆకాంక్షిస్తున్నట్లు లఖ్వీందర్‌ సింగ్‌ తెలిపారు.