Asianet News TeluguAsianet News Telugu

పట్టుబట్టి ప్రచారం చేసి భార్యను గెలిపించిన రవీంద్ర జడేజా.. గుజరాత్ ఎన్నికల్లో రివాబా ఘన విజయం...

జామ్‌నగర్ నార్త్ నియోజిక వర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరుపున పోటీ చేసిన రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా... తన ప్రత్యర్థి కంటే 15 వేలకు పైగా ఓట్లు సాధించి, భారీ మెజారిటీతో ఘన విజయం...

Team India Cricketer Ravindra Jadeja wife Rivaba Jadeja wins in Gujarat Assembly Elections
Author
First Published Dec 8, 2022, 5:33 PM IST

భారత క్రికెటర్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పంతం నెగ్గించుకున్నాడు. గాయం సాకుతో క్రికెట్‌కి దూరంగా ఉండి, భార్య రివాబాని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాడు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా.. 57 శాతానికి పైగా ఓట్లు సాధించి ఘన విజయం అందుకుంది...

గుజరాత్‌లోని జామ్‌నగర్ నార్త్ నియోజిక వర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరుపున పోటీ చేసిన రివాబా జడేజా.. తన ప్రత్యర్థి కంటే 15 వేలకు పైగా ఓట్లు సాధించి, భారీ మెజారిటీతో ఘన విజయం అందుకుంది. ఇదే నియోజిక వర్గం నుంచి పోటీచేసిన ఆమ్ ఆద్మీ అభ్యర్థి కర్షన్‌భాయ్ కర్ముర్ 23 శాతం ఓట్లు దక్కించుకోగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిపేంద్రసిన్హ్ జడేజాకి 15.5 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.. 

కాంగ్రెస్ పార్టీకి చెందిన హరి సింగ్ సోలంకి కుటుంబానికి బంధువులైన రివాబా జడేజా, 2019లో భారతీయ జనతా పార్టీలో చేరింది. రవీంద్ర జడేజా కుటుంబం కూడా ఎన్నో తరాలుగా కాంగ్రెస్ పార్టీకి మద్ధతుదారులుగా ఉన్నారు. రివాబా మామ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేశారు. జడేజా సోదరి నయబా జడేజా, కాంగ్రెస్‌లో ఉంటూ ఆ పార్టీ అభ్యర్థి తరుపున ప్రచారం కూడా చేసింది..

గాయం కారణంగా ఆసియా కప్ 2022 టోర్నీ మధ్యలో నుంచి తప్పుకున్న రవీంద్ర జడేజా, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో కూడా జట్టుకి దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ నుంచి దూరంగా ఉన్నాడు జడ్డూ...

అయితే భార్యతో కలిసి ప్రచారంలో జోరుగా పాల్గొన్నాడు రవీంద్ర జడేజా. అంతేకాకుండా రివాబా ఎన్నికల ప్రచారం కోసం నిర్వహించిన కరపత్రాల్లోనూ రవీంద్ర జడేజా ఫోటోలను ముద్రించారు. మామూలు దుస్తుల్లో ఉంటే సాధారణ ప్రజానీకం గుర్తుపడతారో లేదోనని టీమిండియా జెర్సీలోనే ఫోజులిచ్చాడు జడ్డూ...

భార్య రివాబా ఘన విజయం సాధించడంతో రవీంద్ర జడేజా తిరిగి జట్టులో చేరతాడా? లేక విజయ యాత్ర పేరుతో మరోసారి పొలిటికల్ మీటింగ్‌లకు హాజరవుతాడా? అనేది ఆసక్తికరంగా మారింది. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది టీమిండియా...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ రేసులో నిలవాలంటే టీమిండియాకి ఈ రెండు టెస్టులు గెలవడం అత్యంత కీలకం. ఇప్పటికే వన్డే సిరీస్‌ ఆరంభానికి ముందు మహ్మద్ షమీ దూరం కావడం, రెండో వన్డేలో రోహిత్ శర్మ బొటన వేలికి గాయం కావడంతో ఇద్దరు కీ ప్లేయర్లను కోల్పోయింది టీమిండియా. రవీంద్ర జడేజా కూడా దూరమైతే టీమిండియా కష్టాలు మరింత పెరుగుతాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios