గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న టీమిండియా బ్యాట్స్‌మెన్ అజింక్య రహానే అరుదైన అవకాశాన్ని పొందాడు. ఇంగ్లీష్ కౌంటిల్లో ఆడేందుకు హ్యాంప్‌షైర్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఈ అగ్రిమెంట్ ద్వారా హ్యాంప్‌షైర్‌కు ఆడనున్న మొదటి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఆ జట్టుకు ఆడుతున్న దక్షిణాఫ్రికా ఆటగాడు మార్కరమ్, శ్రీలంక క్రికెటర్ దిముత్ కరుణరత్నే ఇద్దరూ ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదించడంతో కౌంటీల నుంచి వెనక్కి వచ్చేయాల్సిందిగా ఆ దేశ బోర్డులు ఆదేశించాయి.

దీంతో ఖాళీ అయిన మార్క్‌రమ్ స్థానంలో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కోసం రహానేతో హ్యాంప్‌షైర్ యాజమాన్యం సంప్రదించింది. దీనికి అజింక్య ఓకే చెప్పడంతో ఒప్పందం కుదిరింది.

దీనిపై రహానే స్పందిస్తూ కౌంటీల్లో ఆడేందుకు అవకాశం రావడం సంతోషంగా ఉందని.. హ్యాంప్‌షైర్‌కు ఆడుతున్న మొదటి భారతీయుడిని కావడం చాలా ఆనందంగా ఉందన్నాడు.

కౌంటీ క్రికెట్‌కు మంచి పేరుందని.. ఈ లీగ్‌లో మంచి ప్రతిభ చూపి నా జట్టు విజయానికి కృషి చేస్తానని తెలిపాడు. అలాగే తనకు కౌంటీల్లో ఆడేందుకు అవకాశం ఇచ్చిన భారత క్రికెట్ నియంత్రణా మండలికి రహానే కృతజ్ఞతలు తెలిపాడు.

టీమిండియా తరపున 56 టెస్టులాడిన రహానే 40.55 సగటుతో 3,488 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 17 అర్ధసెంచరీలు ఉన్నాయి. అలాగే 90 వన్డేల్లో 35.26 సగటుతో 2,962 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 24 అర్ధసెంచరీలు ఉన్నాయి.