వెస్టిండీస్‌తో తలపడే భారత జట్టులో తనకు చోటు దక్కకపోవడం పట్ల యువ ఓపెనర్ పృథ్వీ షా తీవ్రంగా మదనపడుతున్నాడు. తనకు స్నేహితులు లేరని, ఆలోచనలు ఎవరితో పంచుకోవాలని ఆయన ప్రశ్నిస్తున్నాడు.
టీమిండియాలోకి మెరుపులా దూసుకొచ్చిన యువ ఓపెనర్ ప్రస్తుతం ఫామ్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. గడిచిన రెండేళ్లుగా ఏ ఫార్మాట్‌లనూ రాణించలేక జట్టులో స్థానం సంపాదించడానికి అపసోపాలు పడుతున్నాడు. దీంతో ఈ కుర్రాడు డిప్రెషన్‌కు లోనవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తనకు మిత్రులు కూడా ఎవరూ లేరని.. ఆలోచనలను పంచుకోవాలన్న భయంగా వుందని పృథ్వీ షా ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవల ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. జట్టులో చోటు దక్కకపోవడానికి కారణం తనకు అంతు చిక్కడం లేదని, ఫిట్‌నెస్ వల్లే తనను తీసుకోలేదేమోనని అనుమానం వ్యక్తం చేశారు.
అయితే ఫిట్‌నెస్ వీక్‌గా వుంది అనడాన్ని పృథ్వీషా అంగీకరించడం లేదు. ఎందుకంటే ఈ కుర్రాడు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. దేశవాళీ క్రికెట్‌లోనూ సత్తా చాటి .. టీ20ల్లోకి తిరిగొచ్చాడు. ఇంత జరిగినా విండీస్ టూర్‌కు ప్రకటించిన భారత జట్టులో మాత్రం ఎందుకు అవకాశం రాలేదని పృథ్వీ షా ప్రశ్నిస్తున్నాడు. అయితే పరిస్థితులను బట్టి ముందుకెళ్తాను తప్పించి.. ఎవరితోనూ తాను పోరాడలేనని ఆయన వ్యాఖ్యానించారు.
ఆలోచనలు పంచుకోవాలంటే అవి మర్నాడే సోషల్ మీడియాలో కనిపిస్తాయని పృథ్వీ షా భయాందోళనలు వ్యక్తం చేశాడు. తన గురించి పలువురు ఎన్నో విషయాలు చెబుతున్నారని, తానంటే ఏంటో కొద్దిమందికే తెలుసునని పృథ్వీ షా చెప్పాడు. కాగా.. ఈ యువ ఓపెనర్ ఫామ్‌లో లేకపోవడంతో వెస్టిండీస్‌తో తలపడే భారత టీ20 జట్టుకు పృథ్వీ షాను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఈయన చివరిసారిగా జూలై 2021లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్ తరపున ఆడాడు.
