రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి నుంచి రావల్సిన బకాయిలపై టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే.. ఆమ్రపాలి గ్రూప్‌నకు ధోని 2009 నుంచి 2016 వరకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు.

ఇందుకు గాను పలు వాణిజ్య ప్రకటనల్లో నటించాడు. అంతేకాకుండా ఈ గ్రూపు నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో ధోనితో పాటు అతడి భార్య సాక్షి కూడా పలుపంచుకున్నారు. అమ్రపాలి గ్రూప్‌కు చెందిన చారిటబుల్ వింగ్ నిర్వహించిన పలు కార్యక్రమాల్లో సాక్షి పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే ఇన్వెస్టర్ల నుంచి రూ.2,765 కోట్లను వసూలు చేసి ఈ నిధులను దారి మళ్లించినట్లు ఆమ్రపాలి గ్రూప్‌పై ఆరోపణలు వచ్చాయి. దీనిపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో గ్రూప్‌కు చెందిన 16 ఆస్తుల వేలానికి సర్వోన్నత న్యాయస్థానం ఇటీవలే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

వేలం ద్వారా వచ్చిన నిధులను.. నిలిచిపోయిన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పోరేషన్‌ను ఆదేశించింది. ఈ క్రమంలో ఆమ్రపాలి గ్రూప్ తరపున ప్రచారం చేసినందుకు గాను తనకు ఇవ్వాల్సిన రూ.40 కోట్ల పారితోషికాన్ని ఇవ్వకుండా మోసం చేశారని ధోని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.

అదే విధంగా ఆమ్రపాలి ప్రాజెక్ట్‌లో తాను బుక్ చేసకున్న పెంట్ హౌస్‌ను కూడా స్వాధీనం చేసేలా చేర్యలు తీసుకోవాల్సిందిగా కోరాడు.