టీమిండియా విధ్వంసక ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యాకు కాబోయే భార్య నటాషా స్టాంకోవిక్ జూలై 30న మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ బాబు పేరు ఏం పెడతారా అని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో తన కుమారుడికి ‘అగస్త్య’ అని పేరు పెట్టినట్లుగా హార్డిక్ ప్రకటించారు. సెర్బియన్ నటి నటాషాతో హార్డిక్ పాండ్యా ఈ ఏడాది జనవరి 1న నిశ్చితార్థమైన సంగతి తెలిసిందే.

మే 31న తాను తండ్రిని కాబోతున్నట్లు పాండ్యా ప్రకటించాడు. అయితే పెళ్లికి ముందే బిడ్డకు జన్మనివ్వడంతో ఈ జంటపై నెటిజన్లు తలోరకంగా స్పందించారు. కాగా హార్డిక్ కొడుకు కోసం మెర్సిడెస్ కంపెనీ ఓ బొమ్మ కారును బహుమతిగా పంపింది.

ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించిన హార్దిక్ కంపెనీకి కృతజ్ఞతలు తెలిపాడు. కాగా ఈ ప్రపంచంలోకి తమ కొడుకును తీసుకువచ్చినందుకు ఆసుపత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ హార్దిక్ దంపతులు వేడుక చేసుకున్నారు.

అయితే అందరూ అనుకున్నట్లుగా జూనియర్ హార్దిక్ ముంబైలో జన్మించలేదు. గుజరాత్‌లోని ఆనంద్‌లో ఆకాంక్ష ఆసుపత్రిలో పుట్టాడు. సురక్షితంగా అతడిని తమ చేతుల్లోకి పట్టిన వైద్యులకు హార్దిక్ దంపతులు ధన్యవాదాలు తెలుపుతూనే, తమ జీవితాల్లోకి అడుగుపెట్టిన చిన్నోడికి స్వాగతం పలుకుతూ అదే ఆసుపత్రిలో సెలబ్రేట్ చేసుకున్నారు.