కొందరు ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానుల వల్ల భారత్- ఆసీస్‌ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. టీమిండియా క్రికెటర్లు మ‌హ్మ‌ద్ సిరాజ్‌, జ‌స్‌ప్రీత్ బుమ్రాపై ఆసీస్ అభిమానులు గ్రౌండ్‌లోనే జాతి వివక్ష వ్యాఖ్య‌లు చేశారు.

దీంతో పలువురు మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు క్రికెట్ ఆస్ట్రేలియా సైతం భారత్‌కు క్షమాపణలు చెప్పింది. ఈ వ్యవహారంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫైరయ్యారు.

క్రికెట్‌లో ఇలాంటి వాటికి తావులేదని.. ఎవరైనా అలా చేస్తే మళ్లీ క్రికెట్ ఆడకుండా వారిపై జీవితకాల నిషేధం విధించాలని కోరాడు. దీనిపై ఆదివారం ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.

ఆసీస్ అభిమానులు వీధి రౌడీలకంటే దారుణంగా ప్రవర్తించారని ఆయన ఎద్దేవా చేశారు. జెంటిల్‌మెన్‌ గేమ్‌కు పెట్టింది పేరైన క్రికెట్‌లో జాత్యహంకార వ్యాఖ్య‌లు స‌హించ‌రానివని విరాట్ స్పష్టం చేశాడు.

గ్రౌండ్‌లో ఇప్ప‌టికే ఇలాంటి ఎన్నో ఘ‌ట‌న‌లు చూశామని గుర్తుచేశాడు. కానీ ఆస్ట్రేలియా అభిమానులు చేసిన పని అస‌లు సిస‌లు రౌడీ ప్ర‌వ‌ర్త‌న‌కు నిద‌ర్శ‌నంగా కోహ్లీ ఎద్దేవా చేశాడు.

వెంట‌నే ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌ర‌పాలని విరాట్ డిమాండ్ చేశాడు. మ‌ళ్లీ క్రికెట్‌లో ఈ తరహా ఘటనలు జరగకుండా క‌ఠిన‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు.

కాగా సిడ్నీ టెస్టులో మూడో రోజు ఆటలో సిరాజ్‌, బుమ్రాను లక్ష్యంగా చేసుకొని కొందరు ఆస్ట్రేలియా అభిమానులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే తరహా ఘటన నాలుగోరోజు కూడా జరిగింది.

సిరాజ్‌ను లక్ష్యంగా చేసుకొని కొందరు వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేశారు. నాలుగో రోజు రెండో సెషన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో బ్రౌన్ డాగ్, బిగ్‌ మంకీ అంటూ సిరాజ్‌నుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. సిరాజ్‌ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని బ‌య‌ట‌కు పంపివేశారు. ఈ ఘటనపై అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి సైతం విచారణ చేపట్టింది.