ప్రస్తుతమున్న భారత జట్టులో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు విరాట్ కోహ్లీ. అతడు బ్యాటింగ్ లో ధనాధన్ షాట్లకు ఎక్కువ ప్రాధాన్యత వుండదు. వికెట్ల మధ్య వేగంగా పరుగెడుతూ పరుగులు సాధించడం...చాకచక్యంగా బంతిని  గాల్లోకి లేపకుండానే బౌండరీలు సాధించడం అతడి  స్టైల్. అయితే ఇలా వికెట్ల పరుగెడుతూ పరుగులు సాధించినా కోహ్లీలో కాస్తయినా అలసట అనేదే కనిపించదు. క్రీజులోకి వచ్చినప్పుడు ఎలా వుంటాడో...మైదానాన్ని వీడే సమయంలోనూ అంతే హుషారుతో  వుంటాడు. దీనికి కారణం అతడి ఫిట్ నెస్. 

కోహ్లీ తాజాగా తన ఫిట్ నెస్ రహస్యాలన్నింటిని బయటపెట్టాడు. 2012 ఆస్ట్రేలియాతో సీరిస్ కు ముందు తాను అసలు ఫిట్ నెస్ గురించే పట్టించుకునేవాడిని కాదని కోహ్లీ తెలిపాడు. అయితే ఆసిస్ ఆటగాళ్ల ఫిట్ నెస్ చూసి మాత్రం ఆశ్చర్యపోయేవాడిని. వారి మ్యాచ్ చివర్లో కూడా అదే ఉత్సాహంతో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేయడం చూసి ఆశ్యర్యపోయేవాడినని పేర్కొన్నాడు. వాళ్లలా అలసటకు గురవకుండా ఆడటం ఎలా సాధ్యమని మదనపడుతున్న సమయంలో మా ఫిట్ నెస్ శిక్షకుడు శంకర్ బసు నా అనుమానాన్ని నివృత్తి చేశాడని  కోహ్లీ తెలిపాడు. 

కోహ్లీ ఫిట్ నెస్ గురువు అతడే

అలా అతడి శిక్షణలోనే మొదట ఫిట్ నెస్ పాఠాలు నేర్చుకున్నట్లు తెలిపాడు. కొన్నేళ్లపాటు బసు శిక్షణలోనే ఫిట్ నెస్ సాధనపై దృష్టి సారించా. ఇలా అతడు నాకు  మొదటి ఫిట్ నెస్ గురువుగా మారి నా శరీర స్వభావాన్నే మార్చేశాడని కోహ్లీ చెప్పుకొచ్చాడు. 

అలా గత ఏడేళ్లుగా ఫిట్ నెస్ పై ప్రత్యేక శ్రద్ద పెట్టడంతోనే ఇప్పడిలా వున్నానని అన్నాడు. నా జీవితంలో జిమ్ ను ఓ భాగంగా మార్చుకున్నానని... ఎట్టి పరిస్థితుల్లోనూ పొద్దున వ్యాయామం చేయాల్సిందేనని తెలిపాడు. అలాగే ఆహారం విషయంలో చాలా కఠినంగా వుంటానని... ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా ఇన్నేళ్లుగా కాపాడుకుంటున్న ఫిట్ నెస్ దెబ్బతినడం ఖాయమన్నాడు. శరీరం సహకరిస్తేనే మనలోని అత్యుత్తమ క్రీడాకారుడు బయటకు వస్తాడని తాను బలంగా నమ్ముతానని కోహ్లీ వెల్లడించాడు.