దాదాపు నెలన్నర పాటు సాగిన ప్రపంచ కప్ టోర్నీ, అలాగే రెండు నెలల పాటు ఐపిఎల్, అంతకు ముందు విరామం లేకుండా విదేశీ పర్యటనలు. ఇలా గతకొంత కాలంగా టీమిండియా  కెప్టెన్  విరాట్ కోహ్లీ, యార్కర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ సింగ్ బుమ్రాలు విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నారు. దీంతో త్వరలో వెస్టిండిస్ తో జరగనున్న టెస్ట్, వన్డే, టీ20 సీరిస్ కు వీరిద్దరికి విశ్రాంతినివ్వాలని బిసిసిఐ భావించింది. అయితే కోహ్లీ మాత్రం బిసిసిఐ సూచనను తిరస్కరించి విండీస్ సీరీస్ కు  సంసిద్దత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

విండీస్ పర్యటనపై కోహ్లీ ఆసక్తికి కారణం

మరికొద్దిరోజుల్లో టీమిండియా వెస్టిండిస్ లో పర్యటించనుంది. రెండు టెస్టులు, మూడు వన్డేలు, 3 టీ20 మ్యాచులను కరీబియన్ జట్టుతో ఆడనుంది. అయితే ప్రపంచ కప్ టోర్నీలో సెమీస్ నుండి వెనుదిరిగిన భారత జట్టులో ఆత్మవిశ్వాసం దెబ్బతింది.  దీంతో విండీస్ పర్యటనలో మళ్లీ విజృంభించి విజయాలతో సెమీస్ బాధ నుండి బయటకు రావాలని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు. ఇదే ఆలోచన కోహ్లీ కూడా కలిగివుండటంతో విశ్రాంతి తీసుకోవడం కంటే వెస్టిండిస్ పర్యటనకు వెళ్లడానికే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. 

ఇలా కోహ్లీ బిసిసిఐ సూచనను తిరస్కరించడానికి పెద్ద కారణమే వుందటున్నారు క్రికెట్ పండితులు. కోహ్లీ-రోహిత్ శర్మల మధ్య వివాదం చెలరేగుతున్నట్లు ఇప్పటికే పెద్ద ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విండీస్ పర్యటనలో తనకు విశ్రాంతినిస్తే తప్పకుండా రోహిత్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.  కాబట్టి అతడికి  ఆ అవకాశం ఇవ్వకూడదనే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

సెలెక్టర్లతో కోహ్లీ చర్చలు

ఇప్పటికే కోహ్లీకి విండీస్ పర్యటన నుండి విశ్రాంతి ఇవ్వాలని బిసిసిఐ నుండి సెలెక్టర్లకు ఆదేశాలు అందాయి. దీంతో వారు  కోహ్లీ, బుమ్రాలను మినహాయించి మిగతా ఆటగాళ్ల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఈ సమయంలో కోహ్లీ తన నిర్ణయాన్ని సెలెక్టర్లకు తెలిపాడు. 

వెస్టిండిస్ టూర్ కు తనను ఎంపిక చేయాలని అతడు సెలెక్షన్ కమీటీని కోరినట్లు బిసిసిఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. ఈ పర్యటన కోసం చేపడుతున్న ఆటగాళ్ల ఎంపికలో తనను పరిగణలోకి తీసుకోవాలని అతడు కోరినట్లు...సెలెక్టర్లు కూడా అతడి అభయర్థనను మన్నించినట్లు తెలుస్తోంది. దీంతో టీమిండియా-విండీస్ ల మధ్య జరగనున్న  ఈ సీరీస్ కు కోహ్లీనే సారథిగా ఎంపికయ్యే అవకాశాలున్నాయి.