కుటుంబ సమేతంగా తిరుపతికి రోహిత్ శర్మ..  2023 ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ టోర్నీలకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా కెప్టెన్...

వెస్టిండీస్ టూర్‌ ముగిసిన తర్వాత యూఎస్‌ఏ వెళ్లిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మూడు రోజుల ముందే స్వదేశానికి తిరిగి వచ్చాడు. స్వదేశానికి తిరిగి రాగానే కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నాడు రోహిత్ శర్మ. 

భార్య రితికా, కూతురు సమైరాలతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. వారిని కంట్రోల్ చేసేందుకు సెక్యురిటీ సిబ్బంది తెగ కష్టపడాల్సి వచ్చింది... 2023 ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ టోర్నీలకు ముందు రోహిత్ శర్మ, తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం విశేషంగా మారింది..

ఎందుకంటే గతంలో 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ముందు కూడా శ్రీవారిని దర్శించుకున్నాడు రోహిత్ శర్మ. ఈ టోర్నీలో భారత జట్టు గ్రూప్ స్టేజీలో టేబుల్ టాపర్‌గా నిలిచింది. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఓడింది. టీమ్ పర్ఫామెన్స్ ఎలా ఉన్నా, 2019 వన్డే వరల్డ్ కప్‌లో 5 సెంచరీలతో వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్ 2003 వన్డే వరల్డ్ కప్‌లో బాదిన 673 పరుగుల రికార్డుకి 25 పరుగుల దూరంలో నిలిచాడు..

టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత బ్యాటర్‌గా నిలకడైన ప్రదర్శన ఇవ్వలేకపోతున్న రోహిత్ శర్మ, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మునుపటిలో దుమ్మురేపాలని ఆశపడుతున్నాడు. 2019లో రోహిత్ శర్మ నుంచి ఎలాంటి పర్ఫామెన్స్ వచ్చిందో, అలాంటి ఫీట్ మళ్లీ 2023 వన్డే వరల్డ్ కప్‌లో చూడాలని కోరుకుంటున్నారు హిట్‌మ్యాన్ ఫ్యాన్స్..

ఆగస్టు 30 నుంచి మొదలయ్యే ఆసియా కప్ 2023 టోర్నీ కోసం త్వరలో బీసీసీఐ క్యాంపులో చేరబోతున్నారు రోహిత్ శర్మ అండ్ కో. ప్రస్తుతం వెస్టిండీస్ టూర్‌లో ఉన్న హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్... స్వదేశానికి వచ్చిన తర్వాత వారం రోజులు కుటుంబంతో గడిపి బీసీసీఐ క్యాంపులో చేరతారు. అలాగే ఐర్లాండ్ టూర్‌కి వెళ్లబోతున్న జస్ప్రిత్ బుమ్రా అండ్ టీమ్ సభ్యులు, ఆగస్టు 24న నేరుగా బీసీసీఐ క్యాంపులో చేరతారు..

ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 2న పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడే భారత జట్టు, సెప్టెంబర్ 4న నేపాల్‌తో మ్యాచ్ ఆడుతుంది. ఈ రెండింట్లో విజయం సాధిస్తే సూపర్ 4 రౌండ్‌కి అర్హత సాధిస్తుంది. అదే జరిగితే సెప్టెంబర్ 10న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మరోసారి మ్యాచ్ ఉంటుంది. 

Scroll to load tweet…

గత ఏడాది ఆసియా కప్‌‌కి ముందు మూడేళ్ల పాటు సరైన ఫామ్‌లో లేక అనేక విమర్శలు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ, ఈ టోర్నీలో సూపర్ ఫామ్‌ అందుకున్నాడు. టీమిండియా తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేశాడు.

2018లో కెప్టెన్‌గా 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్ టోర్నీ గెలిచిన రోహిత్ శర్మ, గత ఏడాది టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌లో ఆ ఫీట్‌ని రిపీట్ చేయలేకపోయాడు. ఐపీఎల్‌ సక్సెస్‌తో టీమిండియా కెప్టెన్సీ దక్కించుకున్న రోహిత్ శర్మకు ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్‌ 2023 టోర్నీలు అసలు సిసలైన పరీక్షగా మారబోతున్నాయి.