1983లో కపిల్ డేవిల్స్ వరల్డ్ కప్‌ ట్రోఫీని ముద్దాడిన తర్వాత టీమిండియా మరోసారి విశ్వవిజేతగా ఆవిర్భవించడానికి 28 ఏళ్లు పట్టింది. 2011లో సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో భారత్ రెండోసారి ప్రపంచకప్‌ ట్రోఫీని అందుకుంది.

ధోని విన్నింగ్ షాట్ కొట్టిన ఆ దృశ్యాన్ని ఏ భారతీయుడు మరిచిపోలేడు. ఇక ఆ సందర్భంలో మైదానంలో భారత ఆటగాళ్ల సంబరాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను యువ ఆటగాళ్లు తమ భుజాలపై ఎత్తుకుని వాంఖేడే‌ స్టేడియమంతా కలియతిరిగారు.

ఈ సందర్భంగా నాటి టీమిండియా సభ్యుడు, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. సచిన్‌ను అలా భుజాలపై ఎత్తుకోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. ‘‘ ఓపెన్ నెట్స్ విత్ మయాంక్ పేరుతో మయాంక్ అగర్వాల్ నిర్వహించిన చాట్ షోలో పాల్గొన్న సచిన్ ఎపిక్ మూమెంట్స్‌ను షేర్ చేసుకున్నాడు.

2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ మ్యాచ్ గెలవడం వల్ల తాము వరల్డ్ ఛాంపియన్స్ అయ్యామని కోహ్లీ గుర్తుచేసుకున్నాడు. ఆ సమయంలో తెలియకుండానే టీమ్ మొత్తం సచిన్ చుట్టూ చేరిందని కోహ్లీ చెప్పాడు.

ఎందుకంటే అది మాస్టర్‌కు చివరి వరల్డ్ కప్ అని తామందరికీ తెలుసునన్నాడు. పాజీ దేశానికి ఎంతో చేశాడని.. అలాంటి వ్యక్తికి తామిచ్చిన గిఫ్ట్ వరల్డ్ కప్.. ఆయన భారత క్రికెట్‌ను 21 ఏళ్లుగా మోశాడు. తన ఆటతో దేశంలోని ఎంతో మంది పిల్లలకు స్పూర్తిదాయకంగా నిలిచాడని కోహ్లీ ఉద్వేగంగా చెప్పాడు.

వారందరి తరపున సచిన్‌కు తాము ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఇదని.. తన స్వస్థలంలో సచిన్ కల నెరవేరిందని తామంతా భావించామని, అందుకే గౌరవ సూచకంగా భుజాలపై ఎత్తుకున్నామని కోహ్లీ తెలిపాడు.

కాగా 2011కు ముందు సచిన్ 5 ప్రపంచకప్‌లలో పాల్గొన్నాడు. ఆ ఏడాది వరల్డ్ కప్ ఆరోది. అప్పటికే రెండుసార్లు ట్రోఫీ చిక్కినట్లే చిక్కి చేజారిపోయింది. దీంతో 2011 కాకపోతే మళ్లీ జీవితంలో ఆ అవకాశం రాకపోవచ్చని సచిన్ భావించాడు. అందుకే సచిన్ కోసమైనా ప్రపంచకప్‌ను గెలవాలని టీమిండియా భావించింది.