ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ప్రపంచ కప్ మెగా టోర్నీకి ఆరంభానికి మరికొద్దిరోజుల సమయమే మిగిలుంది. అయితే అప్పటివరకు ప్రత్యక్షంగా ప్రత్యర్ధులతో తలపడే అవకాశం లేకపోవడంతో వారిని మానసికంగా దెబ్బతీసేందుకు ఆటగాళ్లు మాటల యుద్దాన్ని ప్రారంభించారు. ప్రపంచ కప్ లో తమ రికార్డులను, అత్యుత్తమ ప్రదర్శనలను గుర్తుచేస్తూ ఇతర జట్లను ఆందోళనలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఫార్ములాను ఉపయోగించి మన దాయాది పాకిస్థాన్ జట్టును డిఫెన్స్ లోకి నెట్టే ప్రయత్నం చేశాడు టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ. 

ప్రపంచ కప్ లో పాకిస్థాన్ పై ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ టీమిండియా అత్యుత్తమ ప్రదర్శనతో గెలుపు బావుటా ఎగరవేస్తోందని షమీ గుర్తుచేశారు. ఈ మెగా టోర్నీలో పాక్ తో జరిగిన ఒక్క మ్యాచ్ లో ఇండియా ఓటమిపాలవ్వలేదని తెలిపారు. ఆ రికార్డును తాము కొనసాగిస్తూ మరోసారి మంచి విజయాన్ని అందుకోడానికి ప్రయత్నిస్తామని షమీ పేర్కొన్నాడు. 

ప్రస్తుతం భారత జట్టులో ఆటగాళ్ల కాంబినేషన్ బావుందని అభిప్రాయపడ్డాడు. జట్టులో నాణ్యమైన బ్యాట్ మెన్స్, స్పిన్ బౌలర్లు, ఫాస్ట్ బౌలర్లతో పాటు మంచి ఫీల్డర్లున్నారన్నారు. ఇలా వ్యక్తిగతంగా తమ బలాబలాలను తెలిసి వుండటంతో పాటు సహచరుల గురించి కూడా అన్నీ తెలిసిన ఆటగాళ్లు తమ జట్టులో వున్నారని...ఇది తమకెంతో ఉపయోగపడుతుందని  షమీ పేర్కొన్నారు. 

ప్రపంచ కప్ జట్టలో ఎంపికైన ఆటగాళ్లందరూ గతంలో జరిగిన ఇంగ్లాండ్  టూర్ లో పాల్గొన్నవారేనని గుర్తుచేశాడు. కాబట్టి వారందరికి ఇంగ్లాండ్ వాతావరణంతో పాటు అక్కడి  పిచ్ ల పరిస్థితి గురించి తెలుసని అన్నారు. దీంతో అక్కడి పరిస్ధితులకు తగ్గట్లుగా ఆడేందుకు ఇప్పటినుండే సాధన మొదలుపెట్టినట్లు షమీ వెల్లడించాడు.