తొలి టీ20 మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న భారత జట్టు... కెప్టెన్‌గా రోహిత్‌కి వరుసగా ఏడో విజయం...

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు, ఆరు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత భారత కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మకి కెప్టెన్‌గా వరుసగా ఇది ఏడో విజయం... 158 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, కెప్టెన్ రోహిత్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్‌తో మెరుపు ఆరంభం అందించాడు...

పూర్తి స్థాయి కెప్టెన్‌గా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను, వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ శర్మ, టీ20 సిరీస్‌ను కూడా విజయంతో ఆరంభించాడు. 19 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేసిన రోహిత్ శర్మ, వెస్టిండీస్‌పై టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. తొలి టీ20లో 40 పరుగులు చేసిన రోహిత్, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు...

పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, వెస్టిండీస్‌పై టీ20ల్లో 540 పరుగులు చేయగా... రోహిత్ శర్మ 543 పరుగులతో టాప్‌లో నిలిచాడు. విరాట్ కోహ్లీ 501 పరుగులు చేసి టాప్ 3లో ఉన్నాడు. 

64 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. ఆ తర్వాత ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ కలిసి రెండో వికెట్‌కి 29 పరుగులు జోడించారు. 42 బంతుల్లో 4 ఫోర్లతో 35 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో ఫ్యాబియన్ ఆలెన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

13 బంతుల్లో ఓ ఫోర్‌తో 17 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఫ్యాబియన్ ఆలెన్ బౌలింగ్‌లో కిరన్ పోలార్డ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వరుసగా మూడు టీ20 ఇన్నింగ్స్‌ల్లో 30+ స్కోరు కూడా దాటలేకపోవడం నాలుగేళ్లలో ఇదే తొలిసారి...

17 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా తన రికార్డును తిరిగి తెచ్చుకున్నాడు. కివీస్ బ్యాట్స్‌మెన్ మార్టిన్ గప్టిల్ 3299 పరుగులతో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో ఉంటే విరాట్ కోహ్లీ 3244 పరుగులతో రెండో స్థానంలో, రోహిత్ శర్మ 3237 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు... 

రిషబ్ పంత్ 8 బంతుల్లో 8 పరుగులు చేసి కాట్రెల్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 114 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ కలిసి భారత జట్టుకి విజయాన్ని అందించారు...

సూర్యకుమార్ యాదవ్ 18 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో పరుగులు చేయగా, వెంకటేశ్ అయ్యర్ బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 24 పరుగులు చేసి సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ కలిసి అజేయంగా 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ వరుసగా 12 విజయాలు అందుకుని టాప్‌లో ఉండగా, రోహిత్ శర్మ కెప్టెన్‌గా వరుసగా 10 మ్యాచుల్లో విజయాలు అందుకుని రెండో స్థానంలో ఉన్నాడు. ఎమ్మెస్ ధోనీ 9 వరుస విజయాల రికార్డును అధిగమించాడు ‘హిట్ మ్యాన్’...