భారత క్రికెట్ ప్రస్తుతానికి ఎదుర్కొంటున్న ఒక తీవ్రమైన సమస్య వికెట్ కీపింగ్. దిగ్గజ క్రికెటర్‌ ఎం.ఎస్‌ ధోని జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న కాలం నుంచి యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌కు భారత్‌ అవకాశాలు ఇస్తూ వస్తోంది. 

అపార ప్రతిభావంతుడైన పంత్‌ దూకుడుగా ఆడేందుకు వెళ్లి అనవసరంగా వికెట్‌ పారేసుకుని విమర్శల పాలవుతున్నాడు. వరుసగా విఫలమవుతున్నా ఎందుకు పంత్‌కు అవకాశాలు ఇస్తున్నారనే వాదన వినిపిస్తోంది. 

Also read: టీమిండియా: రిషబ్ పంత్ కు కేఎల్ రాహుల్ ముప్పు

ఈ విషయమై టీమ్‌ ఇండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్ బదులిచ్చారు.  నిత్యం రిషబ్‌ పంత్‌ గురించి చర్చ ఎందుకు జరుపుతున్నామంటే అతడు అపారమైన నైపుణ్యం కలిగిన క్రికెటరని విక్రమ్ అన్నారు. 

రిషబ్‌ పంత్‌ ఏ జట్టులోనైనా ఎక్స్‌ ఫ్యాక్టర్‌ కాగలడు అని అందరూ నమ్ముతున్నారని అభిప్రాయపడ్డాడు. భారత జట్టుకూ పంత్‌ ఎక్స్‌ ఫ్యాక్టర్‌ కాగలడని, అందుకే రిషబ్‌ పంత్‌కు సెలక్టర్లు, జట్టు మేనేజ్‌మెంట్‌ మద్దతుగా నిలుస్తున్నారని ఆయన అన్నాడు. 

అందరూ అతడు మంచి క్రికెటర్‌ అని విశ్వసిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించాడు. ఒక్కసారి పంత్‌ పరుగులు చేయటం మొదలుపెడితే.. బిగ్‌ ప్లేయర్‌ అవుతాడని అందరికీ తెలుసునని,  తాను కూడా ఆ విషయాన్ని బలంగా నమ్ముతున్నానని విక్రమ్‌ రాథోడ్ అన్నాడు. 

2019 ప్రపంచకప్‌ ఓటమి అనంతరం సంజయ్ బంగర్‌పై వేటు పడగా విక్రమ్‌ రాథోడ్ బ్యాటింగ్‌ కోచ్‌గా వచ్చాడు. వచ్చీ రాగానే పంత్‌ను ఉద్దేశించి ఒక కీలక వ్యాఖ్య కూడా చేసాడు. ' భయమెరుగుని క్రికెట్‌, బాధ్యతలేని క్రికెట్‌'కు వ్యత్యాసం ఉంటుందని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించాడు. 

Also read: నా నిర్ణయం సరైందే.. ఎవరితోనైనా చర్చకు సిద్ధం... రవిశాస్త్రి

తాజాగా రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, రవిశాస్త్రి, మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌లు పంత్‌కు బాసటగా నిలువగా ఆ జాబితాలోకి తాజాగా బ్యాటింగ్ కోచ్ విక్రమ్‌ రాథోడ్ కూడా చేరిపోయాడు.