సిడ్ని: ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో వున్న టీమిండియా టీ20, వన్టే, టెస్ట్ సీరిస్ ఆడనుంది. అయితే కరోనా కారణంగా లాక్ డౌన్, ఆ తర్వాత ఐపిఎల్ తో అంతర్జాతీయ క్రికెట్ కు దాదాపు ఏడాదిగా దూరమైన భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా ముగించాలని చూస్తోంది. అందుకోసం పకడ్బందీ వ్యూహాలను రచిస్తోంది. ఇందులో బాగంగానే టీ20 సీరిస్ కు స్టార్ బౌలర్లు జస్ప్రీత్ సింగ్ బుమ్రా, మహ్మద్ షమీలను దూరమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 27 నుంచి డిసెంబరు 8 వరకు ఆస్ట్రేలియా జట్టుతో టీమ్‌ఇండియా వన్డే, టీ20 సీరిస్ ఆడనుంది. ఆ తర్వాత డిసెంబరు 17 నుండి టెస్ట్ సీరిస్ ప్రారంభంకానుంది. అయితే ముఖ్యంగా టెస్ట్ సీరిస్ విజయంపై కన్నేసిన భారత జట్టు కీలక బౌలర్లు బుమ్రా, షమీ పూర్తిస్థాయి సామర్థ్యంతో అందుబాటులో వుండేలా చూసుకోవాలని అనుకుంటోంది. అందుకోసమే టీ20 సీరిస్ నుండి వారిద్దరిని దూరం పెట్టి దీపక్‌ చాహర్‌, నటరాజన్‌, నవదీప్‌ సైనీలకు అవకాశం ఇచ్చే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. 

అంతేకాకుండా టెస్ట్ సీరిస్ కోసం ఎంపికయిన మరో కీలక బౌలర్ ఇషాంత్ శర్మ డిసెంబర్ 8న అడిలైడ్ లో జరిగే మొదటి టెస్ట్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో బుమ్రా, షమీలపై ఎక్కువ భారం పడకుండా ప్రధాన కోచ్ రవిశాస్త్రి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టెస్ట్ సీరిస్ కు ముందే ప్రధాన బౌలర్లు బుమ్రా, షమీలకు ప్రత్యేకంగా సన్నద్దం చేసే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.