జూన్ 23 నుంచి లంకాషైర్ కౌంటీ క్లబ్‌తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనున్న టీమిండియా... లంకాషైర్ కౌంటీ తరుపున బరిలో వాషింగ్టన్ సుందర్...

ఇంగ్లాండ్ టూర్‌లో గత ఏడాది సెప్టెంబర్‌లో జరగాల్సిన ఐదో టెస్టు వాయిదా పడి, రీషెడ్యూల్ చేయబడి జూలై 1 నుంచి ప్రారంభం కాబోతోంది. విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత అతని స్థానంలో రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు...

స్వదేశంలో వరుస విజయాలు అందుకున్న రోహిత్ శర్మకు ఇంగ్లాండ్ పర్యటనే తొలి విదేశీ సిరీస్ కానుంది. అదీకాకుండా గత ఇంగ్లాండ్ టూర్‌‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 4 టెస్టులు ఆడి 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచింది భారత జట్టు. దీంతో ఐదో టెస్టు సిరీస్ ఫలితాన్ని డిసైడ్ చేయనుంది...

ఈ టెస్టును డ్రా చేసుకున్నా, భారత జట్టు 2-1 తేడాతో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. ఓడితే మాత్రం టెస్టు సిరీస్‌ను ఇంగ్లాండ్ 2-2 తేడాతో సమం చేసినట్టు అవుతుంది. ఇంగ్లాండ్ పర్యటనలో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు లంకాషైర్‌తో కలిసి నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది భారత జట్టు...

దాదాపు నెల రోజులుగా క్రికెట్‌కి దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్ వంటి ప్లేయర్లు అందరూ ఈ వార్మప్ మ్యాచ్‌లో బరిలో దిగబోతున్నారు. అలాగే కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సుసెక్స్ క్లబ్ తరుపున ఆడి నాలుగు సెంచరీలతో అదరగొట్టిన భారత టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా కూడా టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు...

సౌతాఫ్రికా టూర్‌లో అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్ తర్వాత శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకోలేకపోయిన ఛతేశ్వర్ పూజారా, రంజీ ట్రోఫీలో, కౌంటీల్లో ఆడి ఫామ్ నిరూపించుకుని టీమిండియాలో తిరిగి చోటు దక్కించుకోవడం విశేషం. భారత జట్టు తరుపున మూడేళ్లుగా సెంచరీ చేయలేకపోయిన పూజారా, ఇంగ్లాండ్‌తో జరిగే ఏకైక టెస్టులో ఎలా ఆడతాడనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది..

జూన్ 23న ప్రారంభమయ్యే ఈ వార్మప్ మ్యాచ్, భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్‌లో మొట్టమొదటి సారిగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ టెస్టు మ్యాచ్ ఆడబోతున్నాడు. ఈ నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌ని ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ అవసరం లేకుండా ఫ్రీగా వీక్షించొచ్చు...

స్టార్ స్టోర్స్ ఛానెల్ ఈ వార్మప్ మ్యాచ్‌ని ప్రత్యేక్ష ప్రసారం చేయడం లేదు. అయితే లంకాషైర్‌కి చెందిన యూట్యూబ్ ఛానెల్ ‘ఫాక్సెస్ టీవీ’ (Foxes TV)లో వార్మప్ మ్యాచ్ లైవ్ రానుంది. 

Scroll to load tweet…

భారత స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, ఈ వార్మప్ మ్యాచ్‌లో లంకాషైర్ తరుపున బరిలో దిగబోతుండడం విశేషం. ఇప్పటికే వాషింగ్టన్ సుందర్‌కి వెల్‌కమ్ చెబుతూ ట్వీట్ చేసింది లంకాషైర్ కౌంటీ క్లబ్. 22 ఏళ్ల వాషింగ్టన్ సుందర్‌కి ఇదే మొట్టమొదటి కౌంటీ సీజన్ కానుంది. గాయాల కారణంగా జట్టుకి దూరమైన వాషింగ్టన్ సుందర్, కౌంటీల్లో పర్ఫామెన్స్‌తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్నాడు..