Asianet News TeluguAsianet News Telugu

రెండో వార్మప్ మ్యాచ్‌లో టాపార్డర్ అట్టర్‌ఫ్లాప్... ఆదుకున్న దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్...

Indians vs Northamptonshire: 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఇండియన్స్ జట్టు... దినేశ్ కార్తీక్ కెప్టెన్ ఇన్నింగ్స్, హర్షల్ పటేల్ మెరుపులు... 

Team India 2nd Warm-up match with Northamptonshire, Harshal Patel, Dinesh Karthik Knocks
Author
India, First Published Jul 3, 2022, 9:20 PM IST

ఇంగ్లాండ్‌తో ప్రధాన జట్టు ఓ పక్కన నిర్ణయాత్మక ఐదో టెస్టు ఆడుతుంటే, మరో జట్టు కౌంటీ క్లబ్‌తో కలిసి టీ20 వార్మప్ మ్యాచులు ఆడుతున్న విషయం తెలిసిందే. డర్బీషైర్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న భారత జట్టుకి, నార్తాంప్టన్‌షైర్ క్లబ్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో అదే ధీమాతో బరిలో దిగింది. అయితే కౌంటీ బౌలర్లు దుమ్మురేపే బౌలింగ్‌లో టాపార్డర్‌ను కుప్పకూల్చి, ఇండియన్స్‌ టీమ్‌కి ఊహించని షాక్ ఇచ్చారు...

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇన్నింగ్స్ తొలి బంతికే సంజూ శాంసన్‌ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు జోష్వా కాబ్. గత నాలుగు మ్యాచుల్లో 39, 18, 77, 38 పరుగులు చేసి సత్తా చాటుతూ వచ్చిన సంజూ శాంసన్, గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు...

వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన రాహుల్ త్రిపాఠి 11 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసి బ్రెండన్ గ్లోవర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా 3 బంతులాడి బ్రెండన్ గ్లోవర్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది భారత జట్టు...

ఈ దశలో ఇషాన్ కిషన్, కెప్టెన్ దినేశ్ కార్తీక్ కలిసి నాలుగో వికెట్‌కి 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 20 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, ఫెడ్డీ హెల్డ్‌రీచ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 51 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది ఇండియన్స్ టీమ్...

26 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేసిన కెప్టెన్ దినేశ్ కార్తీక్, ఫెడ్డీ హెల్డ్‌రీచ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ కావడంతో 72 పరుగులకే సగం టీమ్‌ పెవిలియన్‌కి చేరింది...

ఆరంభంలో నెమ్మదిగా ఆడినా ఫెడ్డీ హెల్డ్‌రీచ్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 17 పరుగులు రాబట్టిన హర్షల్ పటేల్, ఆ తర్వా బ్రెండన్ గ్లోవర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో మూడు ఫోర్లతో 14 పరుగులు రాబట్టాడు. ఆరో వికెట్‌కి దినేశ్ కార్తీక్‌తో కలిసి 44 బంతుల్లో 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన వెంకటేశ్ అయ్యర్, 22 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసి నాథన్ బక్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

ఆ తర్వాత ఆవేశ్ ఖాన్ కూడా నాథన్ బక్ బౌలింగ్‌లోనే గోల్డెన్ డకౌట్ అయ్యాడు.  తాను ఎదుర్కొన్న మొదటి 15 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసిన హర్షల్ పటేల్, ఆ తర్వాత 19 బంతుల్లో 44 పరుగులు చేసి... 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు... బ్రెండన్ గ్లోవర్ వేసిన ఇన్నింగ్స్‌ 20వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదిన హర్షల్ పటేల్,  36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసి, ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ ఐదో బంతికి అవుట్ అయ్యాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios