బీసీసీఐకి ఊహించని షాక్.. ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో ప్యాట్రిక్ ఫార్‌హర్ట్‌కి కరోనా పాజిటివ్... అప్రమత్తమైన ఐపీఎల్ మేనేజ్‌మెంట్...

ఐపీఎల్ 2021 సీజన్‌ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్, 2022 సీజన్‌ని తాకింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో ప్యాట్రిక్ ఫార్‌హర్ట్‌కి తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతన్ని వెంటనే ఐసోలేషన్‌కి తరలించింది టీమ్ మేనేజ్‌మెంట్...

ప్యాట్రిక్ ఫార్‌హర్ట్‌ ఆరోగ్య పరిస్థితిని ఢిల్లీ క్యాపిటల్స్ మెడికల్ టీమ్‌ పర్యవేక్షిస్తోంది. ప్యాట్రిక్‌ను కలిసిన, సన్నిహితంగా మెలిగిన ప్లేయర్లకు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఎవ్వరికీ పాజిటివ్ రాకపోవడంతో ఊపిరి పీల్చుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మేనేజ్‌మెంట్...

ఐపీఎల్ 2021 సీజన్‌లో 29 మ్యాచులు ముగిసిన తర్వాత కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడడంతో అర్ధాంతరంగా మ్యాచులను నిలిపివేయాల్సి వచ్చింది. సగం మ్యాచుల తర్వాత మిగిలిన సీజన్‌ని యూఏఈ వేదికగా పూర్తి చేసింది బీసీసీఐ...

ఐపీఎల్ 2021 సీజన్ అనుభవాలతో 2022 సీజన్ బయో బబుల్ నిబంధనలను కఠినతరం చేసింది బీసీసీఐ. ఐపీఎల్ 2022 సీజన్‌ బయో బబుల్‌లోకి బయటి వ్యక్తులను అనుమతించేది లేదు. ప్లేయర్లు, ఒకవేళ బయో బబుల్ దాటి బయటికి వెళితే 7 రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్ పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి జట్టులో కలవాల్సి ఉంటుంది...

బయో బబుల్ దాటి బయటికి వెళితే క్వారంటైన్‌లో ఉండే 7 రోజులకు ప్లేయర్లకు ఎలాంటి మొత్తం చెల్లించడం జరగదు. బయో బబుల్‌ దాటితే జట్టుకి అందుబాటులో లేనట్టుగానే పరిగణిస్తారు... ఏ ప్లేయర్‌ని అయినా బయో బబుల్‌ దాటి బయటికి వెళ్లనిచ్చి, క్వారంటైన్ పూర్తి కాకుండానే లోపలికి అనుమతిస్తే... సదరు ప్లేయర్‌పై ఓ మ్యాచ్ బ్యాన్ విధిస్తారు...

ఒకవేళ ఏ జట్టు అయినా 7 రోజుల క్వారంటైన్‌ పూర్తి కాకుండానే బయటి వ్యక్తులను బయో బబుల్‌లోకి తీసుకు వస్తే... రూ.1 కోటి జరిమానాగా చెల్లించాల్సి ఉంటుందని ఫ్రాంఛైజీలకు ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది ఐపీఎల్ మేనేజ్‌మెంట్.

అయినా ఢిల్లీ క్యాపిటల్స్ బృందంలో కరోనా కేసు వెలుగు చూడడంతో బయో బబుల్‌ సురక్షితమైనా? అనే అనుమానాలు రేగుతున్నాయి. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా సెగ చల్లారడంతో బయో బబుల్ లేకుండా మ్యాచులు నిర్వహించాలనే ప్రతిపాదనలు కూడా పెరుగుతున్నాయి.

బయో బబుల్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య, కఠినమైన ఆంక్షల మధ్య ఆడడాన్ని ప్లేయర్లు ఇబ్బందిపడుతుండడం, మానసిక ఒత్తిడికి గురి అవుతుండడంతో బయో సెక్యూర్ జోన్‌ని తొలగించాలని డిమాండ్ పెరుగుతోంది. 

బయో బబుల్‌ని తొలగించే ఆలోచనలో క్రికెట్ బోర్డులు ఆలోచన చేస్తున్న సమయంలో కరోనా కేసులు వెలుగు చూస్తూ, మహమ్మారి ప్రతాపం చూపిస్తుండడం విశేషం. 

ఇదిలా ఉండగా గాయం కారణంగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు నుంచి తప్పుకున్న రషీక్ సలాం స్థానంలో హర్షిత్ రాణాకి అవకాశం దక్కింది. అలాగే వెన్ను గాయం కారణంగా ఐపీఎల్ 2022 సీజన్ నుంచి దీపక్ చాహార్ పూర్తిగా తప్పుకున్నట్టు అధికారికంగా ప్రకటించింది బీసీసీఐ...